బెంగాల్‌పై గౌతమ్ అదానీ వరాల జల్లు.. లక్ష కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు

బెంగాల్‌పై గౌతమ్ అదానీ వరాల జల్లు.. లక్ష కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు

Gautam Adani announces massive 1 lakh crore investment in West Bengal
  • 2035 నాటికి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ వెల్లడి
  • కోల్‌కతా సమీపంలో రూ. 4,000 కోట్లతో 'అదానీ ఆరోగ్య మందిర్' ఆసుపత్రికి శంకుస్థాపన
  • ఆసుపత్రిలో 50% పడకలు పేదలకు కేటాయించి ఉచిత వైద్యం అందిస్తామని హామీ
  • బెంగాల్‌ను తమ కర్మభూమిగా భావిస్తున్నట్టు అదానీ వ్యాఖ్య
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 2035 నాటికి రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ గురువారం ప్రకటించారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

కోల్‌కతా సమీపంలోని న్యూ టౌన్‌లో 2,000 పడకల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన 'అదానీ ఆరోగ్య మందిర్' ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో గౌతమ్ అదానీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి హాజరయ్యారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌ను తూర్పు భారతదేశంలో తమ ‘కర్మభూమి’గా అభివర్ణించారు. ఈ రాష్ట్రాన్ని కేవలం ఒక పెట్టుబడి కేంద్రంగానే కాకుండా, తాము సేవ చేయాలనుకుంటున్న, భాగం కావాలనుకుంటున్న ప్రదేశంగా చూస్తున్నామని అన్నారు. పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి, పంపిణీ, జాతీయ రహదారులు, రోడ్లు, వంతెనల నిర్మాణం, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి కీలక రంగాల్లో ఈ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించారు.

ఇక 'అదానీ ఆరోగ్య మందిర్' ఆసుపత్రి ప్రాజెక్టు కోసం సుమారు రూ. 4,000 కోట్లు వెచ్చించనున్నారు. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తుందని అదానీ స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని మొత్తం 2,000 పడకల్లో 50 శాతం, అంటే 1,000 పడకలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడ‌బ్ల్యూఎస్‌) కోసం కేటాయిస్తామని, వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

భవిష్యత్తులో ఇదే ప్రాంగణంలో ఒక మెడికల్ కాలేజీ, రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
Advertisement
Gautam Adani
Adani Group West Bengal Investment
Adani Arogya Mandir Kolkata
West Bengal Infrastructure Projects
Adani Group Logistics and Power
Kolkata 2000 Bed Hospital

More Telugu News