ప్రేమ పెళ్లి చేసుకుంటే బహిష్కరణ.. హర్యానాలో గ్రామ పంచాయతీ తీర్పు

ప్రేమ పెళ్లి చేసుకుంటే బహిష్కరణ.. హర్యానాలో గ్రామ పంచాయతీ తీర్పు

Haryana Gram Panchayat bans love marriages and orders social boycott
  • హర్యానాలోని ఓ గ్రామంలో ప్రేమ వివాహాలపై నిషేధం
  • నిబంధన మారితే కుటుంబంతో సహా సామాజిక బహిష్కరణ
  • ఇటీవల మూడు ప్రేమ పెళ్లిళ్లు జరగడంతో గ్రామ పెద్దల నిర్ణయం
  • గ్రామంలోని వారంతా అన్నాచెల్లెళ్లుగా కొత్త వాదన
  • అవగాహన కోసం కమిటీ, ఇంటింటి సర్వేకు సన్నాహాలు
ఆధునిక కాలంలోనూ కొన్ని ప్రాంతాల్లో పాతకాలపు పద్ధతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలోని హిసార్ జిల్లా ఆర్యానగర్ గ్రామ పంచాయతీ ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ప్రేమ వివాహాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటిస్తూ, ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, పెద్దల అంగీకారం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న యువతీయువకులను, వారి కుటుంబాలను సామాజికంగా బహిష్కరిస్తారు. ఇటీవల గ్రామంలో మూడు ప్రేమ పెళ్లిల్లు జరగడమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రేమ వివాహాలు గ్రామ సామాజిక వ్యవస్థకు, సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

గ్రామంలో పుట్టి పెరిగిన వారందరినీ సోదర సోదరీమణులుగా పరిగణించాలని పంచాయతీ తీర్మానించింది. ఈ నేపథ్యంలో, గ్రామస్థులు తమ సొంత గ్రామంలో కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని మాత్రమే వివాహం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ప్రేమ వివాహాలను అరికట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని స్థానిక బీజేపీ నేత హనుమాన్ వర్మ తెలిపారు. అయితే, పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తిగత స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగా సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది.
Advertisement
Aryanagar Gram Panchayat
Love marriage ban Haryana
Hisar village social boycott
Haryana love marriage news

More Telugu News