ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట పాడుతూ కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్‌.. వీడియో వైరల్‌

ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట పాడుతూ కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్‌.. వీడియో వైరల్‌

Nirmala Sitharaman gets emotional listening to MS Subbulakshmi song video goes viral
  • బెంగళూరులో సుబ్బులక్ష్మి 110వ జయంతి కార్యక్రమంలో ఘటన
  • ఆమె సంగీత సాధన, క్రమశిక్షణను గుర్తుచేసుకున్న నిర్మల
  • భిన్న భాషలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలను కలిపే శక్తి సంగీతానికి ఉందని వ్యాఖ్య
  • సుబ్బులక్ష్మి ప్రతిభ వెనుక ఎంతో కఠోరమైన సాధన ఉందని వెల్లడి
  • 1998లో సుబ్బులక్ష్మికి భారతరత్న, 1966లో ఐరాసలో సంగీత ప్రదర్శన
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు దివంగత ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట విని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భావోద్వేగానికి గురయ్యారు. బెంగళూరులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆమె సంగీత సేవలను నిర్మలా సీతారామన్‌ గుర్తుచేసుకున్నారు. కర్ణాటక సంగీతంలో భక్తి భావానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. భిన్న భాషలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలను సంగీతం ఒక్కటిగా కలుపుతుందని పేర్కొన్నారు.

సుబ్బులక్ష్మి సంగీతంపై చూపిన అంకితభావాన్ని కూడా నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు. ఆమె వినయం, క్రమశిక్షణ, కఠినమైన శిక్షణ గురించి మాట్లాడారు. సుబ్బులక్ష్మి ప్రతిభ వెనుక ఎంతో కఠోరమైన సాధన ఉందని పేర్కొన్నారు.

1916 సెప్టెంబరు 16న మధురైలో జన్మించిన ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి 20వ శతాబ్దపు ప్రఖ్యాత గాయనీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 1998లో భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా నిలిచారు. 1974లో రామన్‌ మెగసెసే అవార్డు అందుకున్న తొలి భారతీయ సంగీత కళాకారిణిగానూ రికార్డు సృష్టించారు.

1966లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సంగీత ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా నిలిచారు. 2004 డిసెంబరు 11న చెన్నైలో 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

సుబ్బులక్ష్మి జీవితకథ త్వరలో వెండితెరపైకి రానుంది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘MS - A Legacy On Screen’ పేరుతో బయోపిక్‌ తెరకెక్కుతోంది.
Advertisement
Nirmala Sitharaman
MS Subbulakshmi
Carnatic Music
Bengaluru
MS Subbulakshmi Biopic
Rashmika Mandanna

More Telugu News