నర్సీపట్నంలో ఘనంగా 'జయహో బీసీ' కృతజ్ఞతా సభ... నేతలు ఏమన్నారంటే...!

నర్సీపట్నంలో ఘనంగా 'జయహో బీసీ' కృతజ్ఞతా సభ... నేతలు ఏమన్నారంటే...!

Jayaho BC gratitude meeting in Narsipatnam what leaders said
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు 
  • నర్సీపట్నంలో 'జయహో బీసీ' కృతజ్ఞతా సభ
  • ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేశ్ వరకు బీసీలకు టీడీపీ అండగా నిలిచిందని నేతల ప్రసంగం
  • గత వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శలు
  • రాబోయే స్థానిక ఎన్నికల్లో సమర్థులైన బీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నర్సీపట్నంలో 'జయహో బీసీ' పేరిట భారీ కృతజ్ఞతా సభ జరిగింది. అసెంబ్లీ  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ అగ్రనేతలు హాజరై బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కాలం నుంచే బీసీలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేశారని గుర్తుచేశారు. "గత గొడ్డలి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి 16,800 మంది బీసీ నాయకులకు పదవులు లేకుండా చేసింది. కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీనివల్ల దాదాపు 45,000 మంది బీసీలు సర్పంచులుగా, వేలాది మంది ఎంపీటీసీలుగా, వందలాది మంది మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యే అవకాశం లభించింది" అని వివరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లోని పెద్దలు సమర్థులైన, నిజాయితీపరులైన బీసీ అభ్యర్థులను ఎన్నుకోవాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని పిలుపునిచ్చారు.

రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఇది బీసీల ఆత్మగౌరవ సభ అని అన్నారు. "1983కి ముందు బీసీల బతుకులు ఎలా ఉండేవో గుర్తుచేసుకోవాలి. ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చారు. ఆయన 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, చంద్రబాబు నాయుడు దాన్ని 34 శాతానికి పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, వారిని అణచివేయాలని చూశారు. బీసీల రక్తంలో పసుపు ఉంది, భయపడే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీల భవిష్యత్తుకు ఈ 34 శాతం రిజర్వేషన్లు బంగారు బాట వేస్తాయని అన్నారు. "గత ప్రభుత్వంలో బీసీ నాయకులపై రాజకీయ కక్షతో దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం కోసం సబ్ కమిటీ వేసింది. రాజకీయంగా ఇంకా ప్రాతినిధ్యం లభించని బీసీ కులాలకు సైతం భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తాం. ఇది లోకేష్ గారి మాటగా హామీ ఇస్తున్నాం" అని తెలిపారు.

ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, "బీసీలు పల్లకీ మోసే బోయీలు కాదు, పల్లకీలో కూర్చునే నాయకులని నమ్మిన పార్టీ తెలుగుదేశం. బీసీల పేరు జపించడమే కాదు, వారికి అధికారంతో పాటు గౌరవం కట్టబెట్టిన పార్టీ టీడీపీ" అని అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉత్తరాంధ్రలో కింజరాపు, గౌతు, అయ్యన్నపాత్రుడు వంటి ఎన్నో బీసీ కుటుంబాలకు రాజకీయ సుస్థిరత కల్పించిందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఆయిల్ ఫేడ్ చైర్మన్ గండి బాబుజీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గోండు శంకర్, మామిడి గోవిందరావు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీవీజీ కుమార్, మల్ల సురేంద్ర తదితరులు ప్రసంగించారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలతో సభ ఉత్సాహభరితంగా సాగింది.
Advertisement
Chintakayala Ayyanna Patrudu
Jayaho BC Meeting Narsipatnam
Andhra Pradesh BC Reservations
Chandrababu Naidu BC Welfare
TDP Alliance Government
Kollu Ravindra

More Telugu News