రూ.4 లక్షలు పోయాయి.. అదే జంట 10 నెలల్లో రూ.2 కోట్ల బిజినెస్‌.. అసలు సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే

Kushal Reddy and Chahak Jain lost 4 lakhs then built 2 crore business in 10 months
  • క్లౌడ్‌ కిచెన్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన బెంగళూరు జంట
  • డెలివరీ కమీషన్లు, ప్రకటనల ఖర్చులతో తొలి బిజినెస్‌ మూత
  • ‘క్రైడ్‌’ పేరుతో ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ ప్రారంభం
  • ప్రారంభానికి ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌కు ప్రచారం
  • తొలి రోజే 100 మందికి పైగా కస్టమర్లు
ఒక బిజినెస్‌ ఫెయిల్‌ అయితే చాలామంది అక్కడితో ఆపేస్తారు. కానీ బెంగళూరుకు చెందిన కుశాల్‌ రెడ్డి, చాహక్‌ జైన్‌ మాత్రం అలా చేయలేదు. క్లౌడ్‌ కిచెన్‌ కోసం పెట్టిన రూ.4 లక్షలు నష్టపోయినా వెనక్కి తగ్గలేదు. వ్యాపార విధానాన్ని పూర్తిగా మార్చారు. సోషల్‌ మీడియాలో ముందుగానే తమ బ్రాండ్‌కు గుర్తింపు తెచ్చుకున్నారు. ఫలితం.. కేవలం 10 నెలల్లో దాదాపు రూ.2 కోట్ల ఆదాయం సాధించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

మొదటి ప్రయత్నం.. భారీ నష్టం
కుశాల్‌, చాహక్‌ బెంగళూరులో రూ.4 లక్షల పెట్టుబడితో క్లౌడ్‌ కిచెన్‌ ప్రారంభించారు. అయితే ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రాలేదు. ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు చెల్లించాల్సిన భారీ కమీషన్లు, ప్రకటనల ఖర్చులు వ్యాపారంపై ఒత్తిడి పెంచాయి. నేరుగా వచ్చే ఆర్డర్లు కూడా తక్కువగా ఉండటంతో చివరకు ఆ కిచెన్‌ను మూసేయాల్సి వచ్చింది.

ఈసారి ఫుడ్‌ ట్రక్‌తో కొత్త ప్లాన్‌
మొదటి ప్రయత్నం నుంచి పాఠం నేర్చుకున్న ఈ జంట మరోసారి రంగంలోకి దిగింది. బెంగళూరులోని జేపీ నగర్‌లో ‘క్రైడ్‌’ పేరుతో ఫ్రైడ్‌ ఫుడ్‌ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈసారి క్లౌడ్‌ కిచెన్‌ కాకుండా ఫుడ్‌ ట్రక్‌ను ఎంచుకుంది.

అంతేకాదు.. బిజినెస్‌ ప్రారంభించకముందే ప్రచారం మొదలుపెట్టింది. ఫుడ్‌ ట్రక్‌ తయారీ నుంచి తమ ప్రయాణం వరకు చాహక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, పోస్టుల రూపంలో పంచుకున్నారు. దీంతో ఫుడ్‌ ట్రక్‌ తెరవకముందే క్రైడ్‌కు 5,000 మందికి పైగా ఫాలోవర్లు వచ్చినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మొదటి రోజే 100 మందికి పైగా కస్టమర్లు
2025 సెప్టెంబర్‌లో క్రైడ్‌ ప్రారంభమైంది. తొలి రోజే 100 మందికి పైగా కస్టమర్లు వచ్చినట్లు సమాచారం. మొదటి మూడు రోజుల్లోనే సుమారు రూ.30 వేల అమ్మకాలు జరిగాయి.

ఆ తర్వాత వ్యాపారం వేగంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 350 నుంచి 450 మంది వరకు క్రైడ్‌కు వస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. రోజువారీ అమ్మకాలు దాదాపు రూ.లక్షకు చేరినట్లు సమాచారం. ఫ్రైడ్‌ చికెన్‌, పనీర్‌ బర్గర్లు, చికెన్‌ పాప్‌కార్న్‌, చికెన్‌ స్ట్రిప్స్‌, ఫ్రైస్‌ వంటి ఐటమ్స్‌ ఇక్కడ లభిస్తాయి.

ఫెయిల్యూర్‌నే బలంగా మార్చుకున్నారు
కుశాల్‌, చాహక్‌ కథ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడానికి మరో కారణం ఉంది. మొదటి బిజినెస్‌లో ఎదురైన సమస్యలను గుర్తించి, రెండోసారి అదే విధానాన్ని కొనసాగించలేదు. డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువగా ఆధారపడటానికి బదులుగా తమ సొంత కస్టమర్లను సోషల్‌ మీడియా ద్వారా తయారు చేసుకున్నారు.

క్యాపిటల్‌లెన్స్‌కు చెందిన ప్రథమ్‌ చేసిన ‘ఎక్స్‌’ పోస్టుతో ఈ కథ మరింతగా వైరల్‌ అయింది. రూ.4 లక్షల ప్రారంభ పెట్టుబడి నుంచి 10 నెలల్లో దాదాపు రూ.2 కోట్ల ఆదాయానికి చేరినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఇప్పుడు క్రైడ్‌ను ఫుడ్‌ ట్రక్‌ స్థాయిలోనే ఉంచకుండా మరింత విస్తరించేందుకు ఈ జంట సిద్ధమవుతోంది. పెద్ద సెంట్రల్‌ కిచెన్‌తో పాటు ఫాస్ట్‌-క్యాజువల్‌ రెస్టారెంట్‌ ఔట్‌లెట్లను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
Advertisement
Kushal Reddy
Chahak Jain
Cryde Food Truck
Bengaluru Startup Success
Cloud Kitchen Failure
Food Business Marketing

More Telugu News