అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు బిగ్‌ షాక్‌.. గ్రీన్‌కార్డ్‌ కోసం 179 ఏళ్లు!

Indians in USA face big shock as Green Card wait time hits 179 years
  • భారతీయులకు ఈబీ-2 గ్రీన్‌కార్డ్‌ నిరీక్షణ 179 ఏళ్లు
  • ఈబీ-3లో 38 ఏళ్లు, ఈబీ-1లో 5 ఏళ్ల వరకు వేచి చూడొచ్చు
  • ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ బ్యాక్‌లాగ్‌ 12 లక్షలు
  • ఇందులో దాదాపు 10 లక్షల మంది భారతీయులు
  • మొత్తం పెండింగ్‌లో భారతీయుల వాటా 79 శాతం
అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వత నివాసం పొందాలనుకునే భారతీయ నిపుణులకు ఎదురుచూపులు మరింత పెరిగాయి. గ్రీన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసే కొందరు భారతీయులు 179 ఏళ్ల వరకు వేచి చూడాల్సి రావచ్చని ‘నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ’ (ఎన్‌ఎఫ్‌ఏపీ) తాజా అంచనా వెల్లడించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలో ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులకే అత్యంత సుదీర్ఘ నిరీక్షణ ఉంటోందని తెలిపింది.

డిసెంబరు 2025 నాటికి ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ పెండింగ్‌ దరఖాస్తులు 12 లక్షలు దాటాయి. వీటిలో దాదాపు 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అంటే మొత్తం పెండింగ్‌ దరఖాస్తుల్లో భారతీయుల వాటా 79 శాతంగా ఉంది.

జనవరి 2026 లేదా ఆ తర్వాత లేబర్‌ సర్టిఫికేషన్‌ దరఖాస్తు లేదా ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన భారతీయులకు ఈబీ-2 కేటగిరీలో గ్రీన్‌కార్డ్‌ రావడానికి 179 ఏళ్లు, ఈబీ-3లో 38 ఏళ్లు, ఈబీ-1లో 5 ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఎన్‌ఎఫ్‌ఏపీ పేర్కొంది.

అమెరికా చట్టాల ప్రకారం ప్రతి ఏడాది ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులకు సుమారు 1.40 లక్షల పరిమితి ఉంది. ఇందులో ఉద్యోగితో పాటు అతడి కుటుంబ సభ్యులకూ గ్రీన్‌కార్డులు ఉంటాయి. మరోవైపు దేశాల వారీగా కూడా కోటా పరిమితులు ఉన్నాయి. జనాభా భారీగా ఉన్న భారత్‌ వంటి దేశాలకు చిన్న దేశాలతో సమానంగా పరిమిత సంఖ్యలో గ్రీన్‌కార్డులు లభిస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.

చైనాకు చెందిన ఈబీ-2 దరఖాస్తుదారులకు సుమారు 25 ఏళ్ల నిరీక్షణ ఉండొచ్చని ఎన్‌ఎఫ్‌ఏపీ అంచనా వేసింది. చైనా ఈబీ-3 దరఖాస్తుదారులకు దాదాపు 7 ఏళ్ల సమయం పడొచ్చని తెలిపింది.

భారతీయుల ఈబీ-2 క్యూ ఎలా పెరిగిందో గత గణాంకాలు కూడా చెబుతున్నాయి. 2016లో 47,601 మంది భారతీయుల ఈబీ-2 పిటిషన్లను యూఎస్‌సీఐఎస్‌ క్లియర్‌ చేసింది. కుటుంబ సభ్యులతో కలిపి ఇది దాదాపు 98,594 మందికి సమానం. అయితే ఆ ఏడాది కేవలం 4,407 మంది భారతీయులకే ఈబీ-2 శాశ్వత నివాసం లభించింది.
Advertisement
Indians
US Green Card
NFAP report
EB2 visa backlog
US immigration wait time
Employment based green cards

More Telugu News