Advertisement

వెలిగొండ ప్రాజెక్టు ఆద్యుడు.. 50 ఏళ్ల కిందటే బీజం వేసిన కమ్యూనిస్టు నేత.. ఎవరీ పూల సుబ్బయ్య?

Who is Poola Subbaiah the communist leader who envisioned Veligonda project 50 years ago
  • మార్కాపురం కరవు తీర్చేందుకు పురుడు పోసుకున్న వెలిగొండ ప్రాజెక్టు
  • మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రాజెక్టు కోసం ఉద్యమించిన ఆద్యుడు
  • తండ్రి కల నెరవేరిందంటూ ఆయన కుమార్తెల భావోద్వేగం, హర్షం
పశ్చిమ ప్రకాశం కరవు తీర్చేందుకు యాభై ఏళ్ల కిందట ఓ మహనీయుడు కన్న కల ఇప్పుడు సాకారమవుతోంది. ఆ కలే వెలిగొండ ప్రాజెక్టు. ఆ మహనీయుడే కమ్యూనిస్టు యోధుడు, మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య. ఆయన ఆలోచనల్లోంచి పుట్టిన ఈ ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావడంతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత కరవు ప్రాంతంగా పేరొందిన పశ్చిమ ప్రకాశమే నేటి మార్కాపురం జిల్లా. రాష్ట్రంలో ఎలాంటి పంట కాల్వలు లేకుండా కేవలం వర్షంపైనే ఆధారపడిన ఏకైక జిల్లా ఇదే. ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌ను సొరంగాల ద్వారా తరలించి భూములకు సాగునీరు అందించాలన్నది పూల సుబ్బయ్య ఆలోచన. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఆయన వేసిన బీజం ఇప్పుడు మహా వృక్షమై ఫలాలనివ్వడానికి సిద్ధంగా ఉంది.

వెలిగొండ కోసం అహర్నిశలు శ్రమించిన నేత
పూల సుబ్బయ్య 1929 జూన్ 29న ప్రస్తుత మార్కాపురం జిల్లా కంభంలో జన్మించారు. డిగ్రీ, లా పూర్తిచేసి కొంతకాలం ప్రధానోపాధ్యాయుడిగా, ఆ తర్వాత న్యాయవాదిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులైన ఆయన, సీపీఐలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1962, 1967లలో యర్రగొండపాలెం నుంచి, 1978లో మార్కాపురం నుంచి సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే వెలిగొండ ప్రాజెక్టు ఆవశ్యకతను బలంగా వినిపించి, దానికోసం ఉద్యమాలు చేసి బీజం పడేలా చేశారు.

తండ్రి కల నెరవేరిందంటూ కుమార్తెల హ‌ర్షం
ఎన్నో ఏళ్ల పోరాటం, శంకుస్థాపన చేసిన 30 సంవత్సరాల తర్వాత వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల పనులు పూర్తై కృష్ణా జలాలు పారనుండటంతో తమ తండ్రి కల నెరవేరిందని పూల సుబ్బయ్య కుమార్తెలు సునందిని, విలాసిని, సుభాషిణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ తండ్రి ఆశయ సాధనకు కృషి చేసిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులు, రైతులు, ఉద్యమకారులు, నిర్వాసితులు.. ఇలా ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Poola Subbaiah
Veligonda Project
Prakasam District Irrigation
CPI Leader Poola Subbaiah
Markapuram Water Crisis
Srisailam Backwater Tunnels

More Telugu News