Advertisement

నేపాల్‌ వరద బీభత్సంలో ఆ ఒక్క ఇల్లు చెక్కుచెదరకుండా ఎలా నిలిచింది?

Nepal Floods All Houses Collapsed But How Did This One House Survive
  • ఇంటిని నిర్మించిన విధానమే దీనికి ప్రధాన కారణం
  • బలాన్నిచ్చిన రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ ఫ్రేమ్‌
  • ప్రధాన వరద మార్గానికి కాస్త పక్కన ఉన్న ఇల్లు
  • కొంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించడమూ కలిసొచ్చిన వైనం  
  • ఇంటి ఆకారం వల్ల రెండువైపుల నుంచి పక్కగా ప్రవహించిన నీరు
నేపాల్‌లో ఇటీవల వచ్చిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. భారీ బండరాళ్లు, బురద, చెట్లు దారిలోని ఇళ్లను ధ్వంసం చేశాయి. కానీ ఓ చిన్న పచ్చని ఇల్లు మాత్రం ఆ ఉద్ధృతిని తట్టుకుని నిలిచింది. ఆ ఇంట్లో ఉన్న కుటుంబం కూడా సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.

ఈ ఇల్లు ఎలా నిలిచిందన్న దానిపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఇది కేవలం అదృష్టం కాదు. ఇంటి నిర్మాణం కూడా కీలకంగా పనిచేసింది. నేపాల్‌లోని హిమాలయ లోయల్లో చాలా ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. వాటికి సాధారణంగా రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ ఫ్రేమ్‌ ఉండదు. ఇవి పై నుంచి వచ్చే బరువును తట్టుకోగలిగినా.. పక్క నుంచి భారీగా ఒత్తిడి వస్తే కూలిపోయే అవకాశం ఉంటుంది.

ఈ ఇంటిని మాత్రం రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ ఫ్రేమ్‌తో నిర్మించారు. స్తంభాలు, బీములు, పునాదులను స్టీల్‌ రాడ్లతో అనుసంధానించారు. దీంతో ఇంటికి బలమైన నిర్మాణం ఏర్పడింది. వరద నీరు, బురద ఢీకొన్నప్పుడు వచ్చిన పక్కదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్‌ తట్టుకుంది. ఆ భారాన్ని నేలపైకి మళ్లించింది.

ఇంకో కారణం కూడా ఉంది. ఇల్లు వరద ప్రవాహానికి సరిగ్గా మధ్యలో లేదు. భారీ బండరాళ్లు, మట్టి ప్రధాన ప్రవాహ మార్గంలోనే ఎక్కువగా కొట్టుకొచ్చాయి. ఇల్లు దానికి కాస్త పక్కగా, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇంటి ఆకారం కూడా వరద ప్రవాహం రెండువైపులా వెళ్లేలా చేసింది. ఆ తర్వాత పేరుకుపోయిన మట్టి సహజమైన అడ్డంకిలా మారి మరిన్ని వరద ఉద్ధృతులు నేరుగా ఇంటిని ఢీకొనకుండా చేసింది.

నేపాల్‌ వరదల విషాదంలో ఇప్పటివరకు 700 మందికి పైగా మరణించగా.. 3,000 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
Advertisement
Nepal Floods
Viral Green House
Reinforced Concrete Construction
Flood Survivors
Disaster Resilient Building
Nepal Disaster News

More Telugu News