వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? కేంద్రం తాజా ఆదేశాలు

Central Government latest orders on the end of cooking gas cylinders era
  • ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి మార్పు వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం
  • ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారి నియామకానికి రాష్ట్రాలకు ఆదేశం
  • పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నచోట ఎల్పీజీ వాడకం నిలిపివేయాలని స్పష్టం
  • నిబంధనలు మీరితే ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం
  • ఇంధన భద్రత, సురక్షిత వాడకం కోసమే ఈ చర్యలని వెల్లడి
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో కీలక మార్పును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల నుంచి పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్)కి మారే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఆగస్టు 21న రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC), వినియోగదారుల మధ్య సమన్వయం కోసం జిల్లా స్థాయి పరిపాలనా మద్దతు అత్యవసరమని ఆయన లేఖలో నొక్కిచెప్పారు. ఎల్పీజీ కంటే పీఎన్‌జీ సురక్షితమైనది, పర్యావరణ అనుకూలమైనది కావడంతో పాటు సిలిండర్ల పంపిణీ భారాన్ని తగ్గిస్తుందని కేంద్రం పేర్కొంది.

ఇటీవల 2026 ప్రారంభంలో పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయాలు ఏర్పడగా, దేశీయంగా ఉత్పత్తి అయ్యే పీఎన్‌జీ సరఫరా మాత్రం నిలకడగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే దిగుమతి చేసుకునే ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించి, ఇంధన భద్రతను పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే ప్రభుత్వం అత్యవసర వస్తువుల చట్టం-1955 కింద కొన్ని నిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం, పీఎన్‌జీ సౌకర్యం ఉన్న ఇళ్లు ఎల్పీజీ కనెక్షన్‌ను కలిగి ఉండకూడదు. అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా పీఎన్‌జీకి దరఖాస్తు చేసుకోని వారి ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపివేసే అధికారం కూడా ఉంటుంది. కొత్తగా నియమించే జిల్లా నోడల్ అధికారులు (జిల్లా సరఫరా అధికారి స్థాయికి తగ్గకుండా) హౌసింగ్ సొసైటీల నుంచి అనుమతులు పొందడం, గ్యాస్ కంపెనీల మధ్య సమన్వయం చేయడం, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా జిల్లా స్థాయి నోడల్ అధికారులను నామినేట్ చేసి, వారి వివరాలను పంపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. నిర్ణీత గడువులోగా ఈ మార్పును పూర్తిచేయడమే లక్ష్యమని స్పష్టం చేసింది.
Advertisement
Central Government
LPG Cylinder
PNG Connection
Piped Natural Gas
Ministry of Petroleum
Gas Supply Rules

More Telugu News