పూణే సింహగడ్ కోటలో దౌర్జన్యం.. పొట్టి బట్టలంటూ పర్యాటకులపై దాడి

Violence at Pune Sinhagad Fort as tourists attacked over short clothes
  • పొట్టి దుస్తులు ధరించారంటూ ఓ బృందం అభ్యంతరం
  • ఒక మహిళతో పాటు నలుగురిపై చేయి చేసుకున్న దుండగులు
  • ఘటనపై 8 మందిపై కేసు నమోదు
పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై దాడి జరిగింది. పొట్టి దుస్తులు, స్లీవ్‌లెస్ బట్టలు ధరించారనే కారణంతో ఓ మహిళ సహా నలుగురు టూరిస్టులపై కొందరు చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘సమస్త్ హిందూ బంధవ్ ఆర్మీ’ అనే సంస్థకు చెందిన సభ్యులు కోటలోని తానాజీ మలుసరే స్మారకం వద్ద పర్యాటకులను అడ్డగించారు. ‘షార్ట్స్ ఎందుకు వేసుకున్నారు?’ అంటూ ప్రశ్నించి, హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతూ దాడికి పాల్పడ్డారు.

ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ఆయనపై చేయి చేసుకోగా, ఓ మహిళ ఆయన భార్యను పక్కకు లాగిపడేసింది. ఇదే తరహాలో మరో మూడు బృందాలు కూడా వేధింపులకు గురైనట్లు ఫిర్యాదులు అందాయి. ఎనిమిదేళ్ల బాలిక బెర్ముడా ధరించడంపై కూడా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

ఈ ఘటనపై హవేలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సంకేత్ సంజయ్ పాటిల్, ఆశిష్ దిలీప్ అపర్‌తో పాటు మొత్తం 8 మందిపై దాడి, అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  
Advertisement
Sinhagad Fort
Pune tourist attack
Samast Hindu Bandhav Army
Moral policing Pune
Tanaji Malusare memorial
Haveli Police Station case

More Telugu News