మలయాళంలో రూపొందిన సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ 'మీషా'. తమిళ నటుడు కథిర్ చేసిన తొలి మలయాళ సినిమా ఇది. హకీమ్ షాజహాన్ .. షైన్ టామ్ చాకో కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఈ ఎంసీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ ముగ్గురు ఆర్టిస్టులులకు మంచి క్రేజ్ ఉండటంతో, సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమా,
'ఫారెస్ట్ గార్డ్' పేరుతో ఈ నెల 15వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
మిథున్ (కథిర్) ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. చాలా దట్టమైన అడవీ ప్రాంతంలో అతను విధులను నిర్వహిస్తుంటాడు. ఒక రోజున అతను తన స్నేహితుడు ఆనంద్ (హకీమ్)కి కాల్ చేస్తాడు. మరుసటి రోజున తమ స్నేహతుడైన ఇమ్మాన్యుయేల్ (సుధీ కొప్ప)ను తీసుకుని తన దగ్గరికి వచ్చేయమని చెబుతాడు. వాళ్ల కోసం తాను జింక మాంసం వండిస్తానని అంటాడు. ఏడాదిన్నర తరువాత తామంతా కలిసి ఎంజాయ్ చేయనున్నట్టుగా చెబుతాడు. అందుకు ఆనంద్ అంగీకరిస్తాడు.
ఆ మరుసటి రోజునే ఆనంద్ నేరుగా వెళ్లి రాజకీయ నాయకుడైన పోతు రఘు (జో బేబీ)ను కలుస్తాడు.
మిథున్ నుంచి కాల్ వచ్చిన విషయం చెబుతాడు. మిథున్ జింక మాంసం రెడీ చేయగానే తమకి సమాచారం అందించమని అంటాడు రఘు. అతనిని అరెస్టు చేయించి జైల్లో పెట్టించడమే తమకి మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అందుకు అంగీకరించిన ఆనంద్, ఆ మర్నాడు ఇమ్మాన్యుయేల్ ను వెంటబెట్టుకుని ఫారెస్టుకు వెళతాడు.
అదే సమయంలో తన తండ్రి అంత్యక్రియలను ఘనంగా చేయాలనే ఉద్దేశంతో కృష్ణ ( షైన్ టామ్ చాకో) ఉంటాడు. అడవి జంతువులను వేటాడి తీసుకు రావడం కోసం, డైనమేట్ బషీర్ ను .. తిరుపతి .. సునీని వెంటబెట్టుకుని అడవిలోకి వెళతాడు. అడవి జంతువులను పట్టివ్వడం కోసం కృష్ణ వెళితే, ఫారెస్టు ఆఫీసర్ ను పట్టించడానికి ఆనంద్ వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఎవరి ప్రయత్నం ఫలిస్తుంది? రాజకీయనాయకుడైన రఘుతో మిథున్ కి గల వైరం ఏంటి? అనేది మిగతా కథ.
అడవిలో పార్టీ చేసుకోవడం కోసం ముగ్గురు స్నేహితులు ప్లాన్ చేస్తారు. బంధువుల భోజనాలలోకి అవసరమైన వేట మాంసం కోసం కృష్ణ తన బృందంతో అడవిలోకి వెళతాడు. అక్కడ చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అడవిలో ఏం జరుగుతుంది? అక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో బయటపడతారు? అనేది ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతూ సాగుతుంది.
ఒక గ్రామానికి చెందిన మిథున్ అక్కడి నుంచి అడవికి ఎందుకు మారిపోతాడు? అతని స్నేహితులే అతనిని చూసి బయటపడటానికి కారణాలు ఏమిటి? ఊరికి దూరంగా బ్రతుకున్నప్పటికీ రాజకీయ నాయకులు మిథున్ ను ఎందుకు టార్గెట్ చేస్తారు? అతను తన స్నేహితులను అడవికి ఆహ్వానించడంలోని ఆంతర్యం ఏమిటి? అనే విషయాలు ..అందుకు సంబంధించిన ఫ్లాష్ బ్యాకులు ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే బలమైన అంశాలుగా కనిపిస్తాయి.
గ్రామీణ నేపథ్యం .. అక్కడి సమస్యలు .. రాజకీయాలు .. ప్రేమలు .. గొడవలు వంటి అంశాలను టచ్ చేస్తూ ఈ కథను నడిపించడంలో దర్శకుడు చాలావరకూ సక్సెస్ అయ్యాడు. ప్రతి పాత్రను .. ప్రతి సన్నివేశాన్ని ఆవిష్కరించిన విధానం పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అటు విలేజ్ .. ఇటు ఫారెస్టు నేపథ్యంలో సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
జోసెఫ్ టేకింగ్ .. సురేశ్ రాజన్ ఫొటోగ్రఫీ .. సూరజ్ కురూప్ నేపథ్య సంగీతం .. మనోజ్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. కథాకథనాలు ఒక ఎత్తయితే, కథ కోసం ఎంచుకున్న లొకేషన్స్ ఒక ఎత్తు అని చెప్పాలి. లొకేషన్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలమనీ .. ఆకర్షణ అని చెప్పవలసి ఉంటుంది.
భయం .. బలహీనత .. స్వార్థం ఉన్నవారు అవతలివారి జీవితాలను బలి తీసుకుంటారు. త్యాగానికి సరైన గుర్తింపు దక్కకుండా చేస్తారు. అలాంటప్పుడే ప్రజలు అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలనే సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది.
'ఫారెస్ట్ గార్డ్' (ఆహా) మూవీ రివ్యూ!
Forest Guard Review
Movie Details
Movie Name: Forest Guard
Release Date: 2026-08-15
Cast: Kathir, Hakim Shajahan, Shine Tom Chacko, Sudhi Koppa
Director: EMCY Joseph
Music: Sooraj Kurup
Banner: Bhavani Movies
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer