ఆ రోజు నేను డ్యూటీలో లేను, నీ అదృష్టం.. భారత సంతతి బాలుడితో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

Donald Trump jokes with Indian origin boy saved by lifeguard
  • భారత సంతతి బాలుడిని కాపాడిన లైఫ్‌గార్డ్‌కు ట్రంప్ సత్కారం
  • వైట్ హౌస్‌కు బాలుడిని, లైఫ్‌గార్డ్‌ను ఆహ్వానించిన అధ్యక్షుడు
  • జులై 25న కాలిఫోర్నియా బీచ్‌లో జరిగిన ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో స్పందించిన ట్రంప్
  • లైఫ్‌గార్డ్ నిజమైన హీరో అని కొనియాడిన అమెరికా అధ్యక్షుడు
అమెరికాలో భారత సంతతికి చెందిన 10 ఏళ్ల బాలుడి ప్రాణాలను సాహసోపేతంగా కాపాడిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అభినందించారు. అతడిని నిజమైన హీరో అని కొనియాడారు. ఈ సందర్భంగా లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్, ప్రాణాలతో బయటపడిన బాలుడు నథానియల్ రాయ్, వారి కుటుంబ సభ్యులను ట్రంప్ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌కు నిన్న‌ ఆహ్వానించి సత్కరించారు.

గత నెల జులై 25న కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ వద్ద ఉన్న సీబ్రైట్ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చీలమండల లోతు నీటిలో ఆడుకుంటున్న నథానియల్ రాయ్‌ను శక్తిమంతమైన అలలు ఒక్కసారిగా సముద్రంలోకి లాక్కెళ్లాయి. దీనిని గమనించిన లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్ వెంటనే స్పందించి, ధైర్యంగా సముద్రంలోకి దూకి బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన బాలుడిని, లైఫ్‌గార్డ్‌ను వైట్ హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు.

ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. "ఒక గండం నుంచి బయటపడిన నథానియల్ రాయ్‌కు అభినందనలు. నీ జీవితంలో అదృష్టం నీ వెంటే ఉంటుంది. ఆ రోజు విధుల్లో నేను లేకపోవడం కూడా నీ అదృష్టమే" అని బాలుడితో సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం లైఫ్‌గార్డ్ విలియమ్స్‌ను చూపిస్తూ "ఇతను నిజమైన హీరో" అని ప్రశంసించారు. 

ఈ సందర్భంగా విలియమ్స్ మాట్లాడుతూ.. "ప్రమాదకర సమయాల్లో మా శిక్షణే మమ్మల్ని నడిపిస్తుంది. వీలైనంత త్వరగా బాలుడిని నీటి నుంచి బయటకు తీసుకురావాలనే దానిపైనే నేను దృష్టి పెట్టాను" అని వివరించాడు. తన కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు నథానియల్ తండ్రి సుమిత్ రాయ్, లైఫ్‌గార్డ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విలియమ్స్ తల్లిదండ్రులు షేన్, షానన్, రెస్క్యూలో సహాయపడిన మరో లైఫ్‌గార్డ్ ఆరోన్ బోనిన్ కూడా పాల్గొన్నారు. 
Advertisement
Donald Trump
Nathaniel Roy
Ryder Williams
Indian origin boy saved
White House meeting
California beach rescue

More Telugu News