ఉద్యోగి కంటే ఏఐకే ఎక్కువ ఖర్చు.. టాప్‌ కంపెనీల్లో ఒక్కొక్కరిపై రూ.7 లక్షలు!

  • టాప్‌ 1 శాతం కంపెనీల్లో ఉద్యోగిపై ఏఐ ఖర్చు రూ.7 లక్షలు
  • జనవరిలో ఇదే ఖర్చు రూ.2.47 లక్షలు
  • టాప్‌ 10 శాతం కంపెనీల్లో ఉద్యోగిపై వ్యయం రూ.62 వేలు
  • ఏఐ వినియోగంతో పెరుగుతున్న టోకెన్‌ ఆధారిత ఖర్చులు
  • ఉబర్‌, అమెజాన్‌, వాల్‌మార్ట్‌లో ఏఐ వినియోగానికి పరిమితులు
ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ కంపెనీల ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలోని టాప్‌ 1 శాతం కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై ఏఐ టూల్స్‌ కోసం సగటున రూ.7 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయి. ర్యాంప్‌ ఏఐ ఇండెక్స్‌ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరిలో ఇదే కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై సుమారు రూ.2.47 లక్షలు ఖర్చు చేశాయి. అంటే కొద్ది నెలల్లోనే ఏఐపై వ్యయం దాదాపు మూడు రెట్లు పెరిగింది.

ఏఐ వినియోగంలో కంపెనీల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. టాప్‌ 10 శాతం కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై సుమారు రూ.62 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. అన్ని కంపెనీలను కలిపి చూస్తే ఒక్కో ఉద్యోగిపై వ్యయం కేవలం రూ.1,140గా ఉంది. ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న సంస్థలకు, పరిమితంగా ఉపయోగిస్తున్న సంస్థలకు మధ్య అంతరం వేగంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది.

ఏఐ సేవల ఖర్చు పెరగడానికి టోకెన్‌ ఆధారిత చార్జీలు కూడా కారణమవుతున్నాయి. ఏఐతో ఎక్కువ పని చేస్తే ఎక్కువ టోకెన్లు వినియోగమవుతాయి. దానికి అనుగుణంగా కంపెనీల బిల్లులు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని సంస్థలు ఉద్యోగుల ఏఐ వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. ఉబర్‌, అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వంటి సంస్థలు టోకెన్‌ వినియోగానికి పరిమితులు పెట్టినట్లు నివేదిక తెలిపింది.

వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగంలో ఆంథ్రోపిక్‌ 43.5 శాతంతో ముందుంది. ఓపెన్‌ఏఐ 39.7 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఓపెన్‌ సోర్స్‌, చైనా ఏఐ మోడళ్లను అందించే ప్లాట్‌ఫామ్‌ల వినియోగం కూడా పెరుగుతోంది. జులైలో వీటి వాటా 6.1 శాతానికి చేరింది. అయినా భారీగా ఏఐ వాడుతున్న కంపెనీల్లో ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌పై ఖర్చు మాత్రం తగ్గలేదని నివేదిక పేర్కొంది.
Advertisement

More Telugu News