16 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. యంగెస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా భారత యువకుడి ఘనత

World record at 16 Indian youth Lakshmanan Meiyappan becomes youngest Chartered Accountant
  • ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ రికార్డ్
  • 16 ఏళ్ల 141 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన లక్ష్మణన్ మేయప్పన్
  • పదో తరగతి తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌లో అకౌంటింగ్ ప్రయాణం ప్రారంభం
  • ప్రస్తుతం దుబాయ్‌లో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్‌గా ఉద్యోగం, ఫైనాన్స్‌లో మాస్టర్స్
  • నేర్చుకోవడం ముఖ్యం కానీ వేగం కాదన్న లక్ష్మణన్
సాధారణంగా టీనేజ్‌లో ఉన్న యువత కెరీర్ గురించి ఆలోచిస్తుంటే, లక్ష్మణన్ మేయప్పన్ అనే యువకుడు మాత్రం ఏకంగా ఓ ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హతను పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 16 ఏళ్ల 141 రోజుల వయసులోనే చార్టర్డ్ అకౌంటెంట్ (ఏసీసీఏ) క్వాలిఫికేషన్ సాధించి, 'ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష చార్టర్డ్ అకౌంటెంట్'గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. దుబాయ్‌లో అతను ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

లక్ష్మణన్ ఫైనాన్స్ రంగ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అతను పదో తరగతి బోర్డు పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఈ ప్రయాణం మొదలుపెట్టాడు. తన తల్లి కూడా ఒక ఏసీసీఏ కావడంతో లాక్‌డౌన్ సమయంలో ఆమె అతనికి అకౌంటింగ్‌లోని ప్రాథమిక అంశాలను పరిచయం చేశారు. దాంతో స్ఫూర్తి పొందిన లక్ష్మణన్, 15 ఏళ్ల వయసులో ఏసీసీఏ కోర్సులో చేరి కేవలం ఏడాదిలోనే దాన్ని పూర్తి చేశాడు.

ఈ ఘనతతోనే అతను ఆగిపోలేదు. తన విద్యా, వృత్తిపరమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏసీసీఏ తర్వాత అతను ప్రతిష్ఠాత్మకమైన సీఎఫ్ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) చార్టర్‌ను కూడా సంపాదించాడు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. అంతేగాక దుబాయ్‌లోని సెంచరీ ఫైనాన్షియల్ సంస్థలో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇన్వెస్ట్‌మెంట్లు, రీసెర్చ్, ఆర్థిక మార్కెట్లలో నిర్ణయాలు తీసుకోవడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఈ ప్రపంచ రికార్డుపై లక్ష్మణన్ మాట్లాడుతూ.. "ఈ మైలురాయి నాకు చాలా ప్రత్యేకం. కానీ, నేను అర్హతలను ఎప్పుడూ ఒక పరుగుపందెంలా చూడలేదు. నిజ జీవితంలో ఫైనాన్స్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం, కాలక్రమేణా ఉపయోగపడే నైపుణ్యాలను పెంచుకోవడమే నాకు ముఖ్యం. వేగం కోసం కాకుండా, తెలుసుకోవాలనే ఉత్సుకతతో నేర్చుకున్నప్పుడే ఫలితం మరింత అర్థవంతంగా ఉంటుంది" అని ఎంతో పరిణతితో చెప్పాడు.

చదువు, ఉద్యోగం మాత్రమే కాకుండా అతనికి వాచ్‌లను డిజైన్ చేయడం, తయారు చేయడం లాంటి అభిరుచులు కూడా ఉన్నాయి. పాఠశాల విద్య తర్వాత సంప్రదాయ డిగ్రీ మార్గాలకు భిన్నంగా ప్రొఫెషనల్ అర్హతలను ఎలా సాధించవచ్చో లక్ష్మణన్ ప్రయాణం నేటి విద్యార్థులకు ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.
Advertisement
Lakshmanan Meiyappan
Youngest Chartered Accountant
ACCA Guinness World Record
Indian Youth Achievement
Dubai Century Financial
Professional Accounting Qualification

More Telugu News