అమెరికా సైనికుడిని చంపితే రూ. 28 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన!

Iran announces 28 lakh reward for killing or capturing US soldier
  • అమెరికా సైనికుడిని చంపినా, పట్టుకున్నా 30,000 డాలర్ల బహుమతి
  • ఈ పని చేసిన మహిళలకు రెట్టింపు రివార్డు ప్రకటించిన ఇరాన్
  • సైనికుడిని చంపిన ఆయుధాన్ని రెట్టింపు ధరకు కొంటామని వెల్లడి
  • ఇస్లామాబాద్ ఒప్పందం గడువు ముగుస్తున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన
అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి చొరబడిన అమెరికా సైనికులను చంపినా లేదా సజీవంగా పట్టుకున్నా భారీ నగదు బహుమతి అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప‌శ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని చంపినా లేదా పట్టుకుని అప్పగించినా వారికి 30,000 డాలర్లు (సుమారు రూ. 28ల‌క్ష‌లు) రివార్డుగా ఇస్తామని తెలిపారు. ఈ పనిని ధైర్యవంతులైన ఇరాన్ మహిళలు చేస్తే, వారికి ఈ బహుమతి రెట్టింపు, అంటే 60,000 డాలర్లుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ద్వారా వెల్లడించారు. బహుమతి నగదుతోనే ఆగకుండా, సైనికుడిని చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తామని హతామీ తెలిపారు. ఆ వ్యక్తికి కొత్త ఆయుధం అందించి, పాత ఆయుధాన్ని త్వరలో నిర్మించబోయే మ్యూజియంలో భద్రపరుస్తామని చెప్పారు.

ప‌శ్చిమాసియాలో అమెరికా సైనిక శక్తి గురించి చెబుతున్నవన్నీ అబద్ధాలని ఈ యుద్ధంతో తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హ‌ర్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశించేందుకు అమెరికాకు ఇకపై అనుమతి లేదని హతామీ స్ప‌ష్టం చేశారు.

ఈ ప్రకటన అత్యంత కీలక సమయంలో వెలువడింది. జూన్ 17న ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 'ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్' ప్రకారం 60 రోజుల కాల్పుల విరమణ గడువు సమీపిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి 40 రోజుల పాటు ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరపాలని ఒప్పందం చేసుకున్నా, కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనకు గురవుతోంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. 

దక్షిణ ఇరాన్, హ‌ర్మూజ్‌ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 17 మంది అమెరికా సైనికులు మరణించారు. అయితే, వీరంతా ఇరాక్, జోర్డాన్ వంటి ఇతర దేశాలలో మరణించారే తప్ప, ఇరాన్ భూభాగంపై కాదు. తాజాగా ఇరాన్ చేసిన ఈ బహుమతి ప్రకటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
Advertisement
Iran
United States
Amir Hatami
US Soldiers
Cash Reward
Middle East Tensions

More Telugu News