బోనాలపై ట్రోలింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ఫరియా అబ్దుల్లా

Faria Abdullah bursts into tears over Bonalu festival trolling
  • బోనాల పండుగలో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లా
  • ముస్లిం అయి ఉండి హిందూ పండుగలో పాల్గొనడంపై ట్రోలింగ్
  • 'కాఫిర్' అంటూ దూషించడంతో కన్నీటిపర్యంతమైన ఫరియా
  • ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటానని భావోద్వేగ వీడియో
  • తండ్రి జన్మతః హిందువైనా ఇస్లాం నచ్చి మతం మారారన్న నటి
ప్రముఖ నటి, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. బోనాల పండుగలో పాల్గొన్నందుకు తనను ట్రోల్ చేస్తున్న వారిపై స్పందిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ద్వేషాన్ని ప్రేమతోనే జయిస్తానని, తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ ఓ సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశారు.

ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఫరియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్లకు ఉత్సాహంగా నృత్యం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే, ముస్లిం నేపథ్యం ఉన్న ఫరియా హిందూ పండుగలో పాలుపంచుకోవడాన్ని సోషల్ మీడియాలోని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెను 'కాఫిర్' (మత విశ్వాసం లేని వ్యక్తి) అని సంబోధిస్తూ, మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

ఈ ట్రోలింగ్‌పై ఫరియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. "మా నాన్న (సంజయ్ అబ్దుల్లా) పుట్టుకతో హిందువు. ఆయన ఇస్లాం సిద్ధాంతాలు నచ్చి ఆ మతంలోకి మారారు. ఒక మతాన్ని అంతగా ఇష్టపడి స్వీకరించిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు, నాకు అందులోని మంచి విషయాలే కనిపించాయి" అని ఆమె భావోద్వేగంగా చెప్పారు. "నన్ను 'కాఫిర్' అని పిలుస్తూ ద్వేషించే వారికి కూడా మంచి జరగాలనే కోరుకుంటాను. నేను ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటాను" అని స్పష్టం చేశారు.

ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రతి అంశంలో తాను దైవాన్ని చూస్తానని ఫరియా తెలిపారు. అన్నింటిలో భగవంతుడిని చూడకపోతే జీవితంలో చాలా కోల్పోతామన్నారు. తన ప్రేమను, భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరూ ఆపలేరని, ఇదే తన తిరుగుబాటు అని ఆమె తేల్చిచెప్పారు. ఫరియాకు మద్దతుగా నటి లక్ష్మీ మంచుతో పాటు పలువురు నెటిజన్లు, అభిమానులు నిలుస్తున్నారు.
Advertisement
Faria Abdullah
Bonalu Trolling
Jathi Ratnalu Actress
Hyderabad Bonalu Festival
Faria Abdullah Emotional Video
Sanjay Abdullah

More Telugu News