జెన్-జీ, జెన్-ఆల్ఫా లేబుళ్లు పాశ్చాత్య ధోరణి.. మన బిడ్డలను కొడుకులు, కూతుళ్లు అని పిలుద్దాం: అసోం సీఎం హిమంత
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హిమంత బిశ్వ శర్మ
- జెన్-జీ, జెన్-ఆల్ఫా వంటివి యూరోపియన్ సంస్కృతి నుంచి వచ్చాయని వెల్లడి
- యువత పాశ్చాత్య భావనల ప్రభావంలో పడొద్దని హితవు
నేటి యువతను ‘జెన్-జీ’ (Gen Z) లేదా ‘జెన్-ఆల్ఫా’ (Gen Alpha) అంటూ విదేశీ పదాలతో సంబోధించడంపై అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బశ్వ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌహతి మాట్లాడిన ఆయన, ఇలాంటి వర్గీకరణలు యూరోపియన్ సంస్కృతి నుంచి వచ్చినవని తెలిపారు. మన సమాజంలో పిల్లలను ప్రేమగా ‘కొడుకులు, కూతుళ్లు’ అని పిలుచుకోవడమే మన భారతీయ సంస్కృతికి, గుర్తింపునకు నిజమైన ప్రతీక అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో యువత సంక్షేమం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ఒక ప్రత్యేక ‘యువజన అభివృద్ధి, సాధికారత శాఖ’ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. మన యువత పాశ్చాత్య భావనల ప్రభావంలో పడకుండా, అసోం సొంత సంస్కృతి, గొప్ప చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూ స్వయంసమృద్ధి కలిగిన రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ ప్రసంగంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మరికొన్ని సంచలన ప్రకటనలు కూడా చేశారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు నవంబర్ 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపడతారని స్పష్టం చేశారు. అలాగే 2026 నుంచి 2031 మధ్య కాలంలో అసోం మౌలిక వసతుల రంగాన్ని భారీగా ఆధునికీకరించేందుకు రూ. 1.5 లక్షల కోట్ల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. పాలనా సౌలభ్యం కోసం 8 కొత్త సబ్-డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగి తన మొదటి భార్యకు న్యాయబద్ధంగా విడాకులు ఇవ్వకుండా వదిలేస్తే, అతని నెలవారీ జీతంలో 50 శాతం మొత్తాన్ని నేరుగా ఆ భార్యకే అందజేసేలా చట్టపరమైన నిబంధనలు తీసురానున్నట్లు వెల్లడించారు.