స్థానిక ఎన్నికలు ఆపేందుకు వైసీపీ కుట్ర: మంత్రి కొల్లు రవీంద్ర
Add ap7am to your home Screen

స్థానిక ఎన్నికలు ఆపేందుకు వైసీపీ కుట్ర: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra slams YSRCP for conspiring to stop local body elections
  • ఎన్నికలు జరగకపోతే రూ. 12,500 కోట్ల కేంద్ర నిధులు ఆగిపోతాయని వెల్లడి
  • బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ
  • గతంలో వైసీపీయే రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని విమర్శ
  • ఓటమి భయంతోనే వైసీపీ కోర్టులకు వెళ్లి ఎన్నికలను అడ్డుకుంటోందని వ్యాఖ్య
వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని, తద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 12,500 కోట్ల ఆర్థిక సంఘం నిధులను నిలిపివేయాలని చూస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పునాది వేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని 34 శాతానికి పెంచి వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. అయితే, గత ప్రభుత్వం కుట్రపూరితంగా కోర్టుల ద్వారా ఈ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. దీనివల్ల దాదాపు 16,800 మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేశామని, దీనిపై ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని బీసీ కమిషన్ నివేదిక త్వరలో ప్రభుత్వానికి అందనుందని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినందున 16వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరని, ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు వెళుతుంటే.. ఓటమి భయంతో వైసీపీ మరోసారి కోర్టులను ఆశ్రయించి ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన రూ.12,500 కోట్లు రాకుండా అడ్డుకోవడమే వారి దురుద్దేశమని విమర్శించారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామీణ వ్యవస్థ సర్వనాశనమైందని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే బీసీల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని, జగన్ పాలనలో తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య వంటి బీసీ నేతల హత్యలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు కల్లబొల్లి మాటలతో బీసీలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, వారి నాటకాలను బీసీ సోదరులు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మరని హితవు పలికారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తోందని, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు వంటి హామీలను నెరవేరుస్తోందని వివరించారు. చట్టపరంగా అన్ని అడ్డంకులను అధిగమించి బీసీలకు న్యాయం చేస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నికలు నిర్వహించి తీరుతామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
Advertisement
Kollu Ravindra
YSRCP
Local Body Elections
BC Reservations Andhra Pradesh
Finance Commission Funds

More Telugu News