బెంగళూరు ఫైవ్ స్టార్ హోటళ్లలో తనిఖీలు.. కిచెన్ నిండా కుళ్లిన కూరగాయలు, పాడైన మాంసం!
- ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ బెంగళూరు స్టార్ హోటళ్ల అసలు రంగు
- ప్రముఖ హోటళ్ల గుట్టు రట్టు
- ఒక్క హోటల్‌లోనే 78 కేజీల పాడైన మాంసం స్వాధీనం
ఖరీదైన ఆంబియెన్స్, ఫైవ్ స్టార్ హంగులతో మెరిసిపోయే బెంగళూరు ప్రముఖ హోటళ్ల అసలు రంగు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిన కూరగాయలు, ఫంగస్ పట్టిన ఆహారం, ఎక్స్‌పైరీ దాటిన పాలు ఉపయోగిస్తున్న ప్రముఖ స్టార్ హోటళ్ల గుట్టును అధికారులు రట్టు చేశారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ ఆదేశాలతో 30 ప్రత్యేక బృందాలు బెంగళూరు అర్బన్ జిల్లా పరిధిలోని 26 లగ్జరీ హోటళ్లపై ఏకకాలంలో విరుచుకుపడ్డాయి.
తాజ్ యశ్వంత్‌పూర్, షాంగ్రి-లా, వివాంటా, లలిత్ అశోక్ వంటి హేమాహేమీ హోటళ్ల వంటగదుల్లో కనీస పారిశుద్ధ్యం లేకపోగా... వెజ్, నాన్-వెజ్ పదార్థాలను కలిపి ప్రమాదకర రీతిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. లలిత్ అశోక్ హోటల్‌లోనే ఏకంగా 76 కేజీల పాడైన మాంసం, 200 కేజీల కుళ్లిన కూరగాయలను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే నాశనం చేశారు. పలు హోటళ్ల నుంచి ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించిన అధికారులు.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న స్టార్ హోటళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.