నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతాం.. పేర్ని నానికి బొండా ఉమ తీవ్ర హెచ్చరిక
- నిరసనల పేరుతో రోడ్లపై బూతులు తిడితే ఊరుకోబోమన్న బొండా ఉమ
- తాము రౌడీయిజం చేస్తే రోడ్లపై తిరగగలరా అని ప్రశ్న
- హద్దు మీరి ప్రవర్తిస్తే సంగతి తేలుస్తామని హెచ్చరిక
విమర్శలు హుందాగా చేయాలని, హద్దు మీరి నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతామని వైసీపీ నేత పేర్ని నానితో పాటు ఆ పార్టీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడితే చూస్తూ ఊరుకునేది లేదని, డీఎస్సీపై చర్చకు సిద్ధమని సవాల్ చేస్తే ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదని బొండా ఉమ స్పష్టం చేశారు. "మీరు రప్పా.. రప్పా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేము కనుక రౌడీయిజం చేస్తే మీరు రోడ్లపై తిరగగలరా? నా టికెట్ గురించి మాట్లాడటానికి మీరెవరు? మా అధినేత చంద్రబాబు అనుకుంటే టికెట్ ఇస్తారు" అన్నారు. అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో తన నియోజకవర్గం టాప్ 8లో ఉందని తెలిపిన ఆయన, ఇకపై హద్దు మీరి ప్రవర్తిస్తే ఎక్కడికైనా వచ్చి సంగతి తేలుస్తామని హెచ్చరించారు.