నీటి కష్టాలకు భారత్‌పై నెపం.. పాకిస్థాన్ అసలు రంగు బయటపెట్టిన నివేదిక!

Pakistan water crisis report exposes internal failures and blame game on India
  • నీటి సంక్షోభానికి భారత్‌పై నెపం నెడుతున్న పాకిస్థాన్
  • అసలు కారణం అవినీతి, అంతర్గత కుమ్ములాటలేనని తెలిపిన నివేదిక
  • పహల్గాం ఉగ్రదాడి తర్వాతే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్
  • భారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైన్యం ప్రచార కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపణలు
  • పంజాబ్ వంటి ప్రావిన్సులు డ్యామ్‌లతో దిగువ రాష్ట్రాలను దెబ్బతీస్తున్న వైనం
తమ దేశంలో నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభానికి కారణం భారత్ అంటూ పాకిస్థాన్ నిరంతరం ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ, అసలు సమస్య వారి అంతర్గత పాలనా వైఫల్యాలు, అవినీతిలోనే ఉందని ఓ సంచలన నివేదిక వెల్లడించింది. కెనడాకు చెందిన 'జియోపొలిటికల్ మానిటర్' ప్రచురించిన కథనం ప్రకారం.. పాకిస్థాన్ చేతకానితనం, తప్పుడు ప్రణాళికలు, అవినీతి విధానాలే దేశాన్ని నీటి ఎద్దడి దిశగా నెట్టాయి. సింధు జలాల ఒప్పందం (ఐడ‌బ్ల్యూటీ) విషయంలో భారత్‌పై యుద్ధానికి వెళ‌తామంటూ బెదిరించడం ద్వారా పాకిస్థాన్ తనను తానే మరింత ప్రమాదంలోకి నెట్టుకుంటోందని ఆ నివేదిక హెచ్చరించింది.

గతేడాది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో జరిపిన కిరాతక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఆపే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్న‌ట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

అయితే, పహల్గాం దాడి విషయాన్ని దాచిపెట్టి, ఒప్పందం నిలిపివేతను భారత్ దుందుడుకు చర్యగా పాక్ చిత్రీకరిస్తోంది. సైనిక చర్యకు ఇదే సరైన కారణమంటూ రెచ్చగొడుతోంది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. భారత్ ఒప్పందాన్ని పునరుద్ధరించకపోతే అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ వివాదంపై భారత్‌కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్‌) విభాగం ఒక ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోందని లీకైన పత్రాల ద్వారా తెలుస్తోందని నివేదిక పేర్కొంది. సైన్యం పౌర వ్యవహారాల్లో తలదూర్చుతోందన్న విమర్శలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తోంది.

నిజానికి 2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖల మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. జాతీయ దుబారా అలవాటు వల్లే దేశంలో నీరు, గ్యాస్, విద్యుత్ కొరత ఏర్పడిందని అంగీకరించారు. నీటి సమస్యలు పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఆయన వ్యాఖ్యలు, ప్రస్తుత పాక్ పాలకుల ఆరోపణలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 

ఒప్పందం కుదిరిన నాటి నుంచి డ్యామ్‌ల నిర్మాణంపై పాక్ విపరీతమైన ఆసక్తి చూపింది. ఈ డ్యామ్‌ల నిర్మాణం సైన్యానికి పట్టున్న పంజాబ్ ప్రాంతానికే ఎక్కువగా ఉపయోగపడింది. ఈ క్రమంలో పంజాబ్ వంటి ఎగువ ప్రావిన్సులు దిగువన ఉన్న సింధ్ ప్రావిన్స్ వంటి ప్రాంతాల ప్రయోజనాలను దెబ్బతీస్తూ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని, అయినా కొత్త డ్యామ్‌ల నిర్మాణం ఆగడం లేదని ఆ నివేదిక వివరించింది.
Advertisement
Pakistan
Indus Waters Treaty
Pakistan Water Crisis
Geopolitical Monitor Report
Bilawal Bhutto
India Pakistan Water Dispute

More Telugu News