ఏపీపై ఎల్‌నినో పంజా.. కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్

YS Sharmila slams AP coalition government over El Nino impact and agricultural crisis
  • ఏపీలో ఎల్‌నినో కారణంగా తీవ్ర వ్యవసాయ సంక్షోభం నెలకొందని షర్మిల ఆందోళన
  • ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శ
  • రాష్ట్రంలో 69 శాతం వర్షపాతం లోటు ఏర్పడిందని, 50 లక్షల ఎకరాలు ప్రభావితమయ్యాయని వెల్లడి
  • రైతులకు నష్టపరిహారం, రుణాల రీషెడ్యూల్ సహా పలు డిమాండ్లు
  • వెంటనే స్పందించకుంటే రైతులు, ఇతర వర్గాలతో కలిసి సర్కారు వెన్ను విరుస్తామని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వ్యవసాయ సంక్షోభం నెలకొందంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తుంటే, ప్రభుత్వం రైతులను గాలికొదిలేసి రాజకీయాలు, పొగడ్త సభల్లో మునిగి తేలుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడితో పాటు ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను షర్మిల గణాంకాలతో సహా వివరించారు. జూలై చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే 69 శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. జూన్ 1 నుంచి జూలై మధ్య వరకు 166.76 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 86.51 మి.మీ. మాత్రమే నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే మూడు నెలల్లో సైతం 40 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని, దీని ప్రభావం ప్రత్యక్షంగా 50 లక్షల ఎకరాలపై పడిందని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కరవు ఛాయలు అలుముకున్నాయని, ఎటు చూసినా బీడు భూములే కనిపిస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపించారు. "పాలనను గాలికొదిలేసి, కులమత కొట్లాటల్లో, కేసుల్లో, మోదీ పొగడ్త సభల్లో మీరు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజీగా ఉన్నారు. అటు వైసీపీ, ఇటు కూటమి రెండూ ఒకటే. వీరికి రాష్ట్రం, ప్రజల బాగోగులు పట్టవు" అని ఆమె వ్యాఖ్యానించారు. 

ఆరేడు నెలలుగా ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు వస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం కనీస కంటింజెన్సీ ప్రణాళికలు కూడా సిద్ధం చేయలేదని దుయ్యబట్టారు. జిల్లాల వారీగా సమీక్షలు, రైతులకు మార్గదర్శకాలు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం క్వాంటం, డేటా సెంటర్లంటూ కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నారని, మిమ్మల్ని నమ్ముకున్న లక్షలాది రైతుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ తరఫున పలు డిమాండ్లను ఆమె ప్రభుత్వం ముందు ఉంచారు.

కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు:
1. ఎండిపోయిన పంటలకు ఎకరాకు తగిన నష్టపరిహారం చెల్లించాలి.
2. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ఉచితంగా లేదా సబ్సిడీపై అందించాలి.
3. రిజర్వాయర్ల నుంచి చివరి ఆయకట్టు భూములకు కూడా నీరందేలా చూడాలి.
4. వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయాలి.
5. రైతులకు కొత్తగా వడ్డీ లేని రుణాలు అందించాలి.
6. ఎల్‌నినో నష్టాలను అంచనా వేసి ప్రతి రైతుకు ఉచితంగా పంటల బీమా వర్తింపజేయాలి.
7. పశుగ్రాసం కొరత తీర్చేందుకు పాడి రైతులకు ప్రత్యేక సబ్సిడీలు ఇవ్వాలి.

తక్షణమే మేల్కొని మంత్రులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి రైతులను ఆదుకోవాలని షర్మిల సూచించారు. "ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే రైతులు, ఇతర వర్గాల ప్రజలతో కలిసి మీ సర్కారు వెన్ను విరిచి మరీ నిలదీస్తారని మరవకండి" అని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Advertisement
YS Sharmila
Andhra Pradesh Agriculture Crisis
El Nino Impact AP
Chandrababu Naidu Government
AP Congress Farmer Demands
Rainfall Deficit Andhra Pradesh

More Telugu News