నేనేం బాబా బాగేశ్వర్‌ను కాదు, కానీ..!: విద్యార్థులను నవ్వించిన ప్రధాని మోదీ

PM Modi I am not Baba Bageshwar but says PM to laughing students
  • ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో బాబా బాగేశ్వర్ పేరును ప్రస్తావించిన ప్రధాని
  • డిగ్రీలతో పాటు దేశం కోసం ఏదైనా చేయాలనే కలను మోసుకెళ్తున్నారన్న మోదీ
  • 3,000 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీల ప్రదానం, ప్రతిభావంతులకు పురస్కారాలు
  • ప్రతిభావంతులైన విద్యార్థినుల సంఖ్య పెరగాలంటూ సరదాగా వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా బాగేశ్వర్ (ధీరేంద్ర కృష్ణ శాస్త్రి) పేరును ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారి మనసులోని ఆలోచనలను సరదాగా ఊహించి చెప్పారు.

"మీరంతా ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యారు. కానీ, మీ మనసుల్లో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. నేనేం బాబా బాగేశ్వర్‌ను కాదు, కానీ మీ మదిలో ఏముందో ఊహించగలను. కొందరు భవిష్యత్తు గురించి, మరికొందరు జీతాల గురించి, ఇంకొందరు కొత్త నగరంలో కొత్త జీవితం గురించి, మరికొందరు స్టార్టప్‌ల గురించి ఆలోచిస్తుండవచ్చు" అని మోదీ వ్యాఖ్యానించడంతో విద్యార్థులు, అధ్యాపకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో 3,000 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. "ఈ రోజు మీ కుటుంబ సభ్యులు ఎంత గర్వపడుతున్నారో, నేను కూడా మీ గురించి అంతే గర్విస్తున్నాను. మీరు కేవలం డిగ్రీలు అందుకోవట్లేదు, దేశం కోసం ఏదైనా సాధించాలనే కలను ముందుకు తీసుకెళుతున్నారు" అని విద్యార్థులను అభినందించారు. ప్రతి ఒక్కరి మార్గం, కలలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఐఐటీలో చేరిన మొదటి రోజు నుంచి ఈ స్నాతకోత్సవం వరకు సాగిన ప్రయాణం ప్రతి ఒక్కరిలో సంతృప్తిని నింపుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అకడమిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రధాని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా స్పందిస్తూ.. "ప్రతిభావంతులైన విద్యార్థుల్లో కొంతమంది ఆడపిల్లలు ఉంటే బాగుండేది. క్షమించాలి, కొందరు కాదు, చాలామంది ఉండాలి" అని వ్యాఖ్యానించడంతో సభలో మరోసారి నవ్వులు విరిశాయి.

అనంతరం ఐఐటీ సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన 'పరం ప్రజ్ఞ' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై-పెర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సదుపాయం ఏఐ, డేటా సైన్స్, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు క్యాంపస్ జీవితం, స్నేహితులు, గురువులు ఎప్పటికీ గుర్తుండిపోతారని మోదీ విద్యార్థులకు సూచించారు.
Advertisement
PM Modi
Narendra Modi
Baba Bageshwar
IIT Convocation
Param Pragnya Supercomputer
Dhirendra Krishna Shastri
IIT Sonipat

More Telugu News