తత్కాల్‌ టికెట్‌ దొరకలేదా? ఈ ఆప్షన్‌తో కన్ఫర్మ్‌ సీటు మీ సొంతం!

IRCTC Current Booking helps you get confirmed train tickets if Tatkal is unavailable
  • తత్కాల్‌ టికెట్‌ దొరక్కపోయినా మరో అవకాశం
  • ‘కరెంట్‌ బుకింగ్‌’లో ఖాళీ సీట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటు
  • ఇందులో నేరుగా కన్ఫర్మ్‌ టికెట్‌ లభించే ఛాన్స్‌
  • అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు
  • కొన్ని రైళ్లలో 10-30 శాతం తగ్గింపు ఉండే అవకాశం
  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లోని ‘Charts Vacant’లో ఖాళీ సీట్ల వివరాలు
తత్కాల్‌ టికెట్‌ దొరకలేదని ప్రయాణం ఆపేయాల్సిన అవసరం లేదు. రైల్వేలో ‘కరెంట్‌ బుకింగ్‌’ అనే మరో అవకాశం ఉంది. రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను ఇందులో బుక్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా తత్కాల్‌ ఛార్జీలు లేకుండానే సాధారణ టికెట్‌ ధరతోనే ప్రయాణికులు సీటు పొందొచ్చు.

రైలు బయలుదేరే ముందు తొలి రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమవుతుంది. సాధారణంగా ఇది ప్రయాణ సమయానికి నాలుగు గంటల ముందు తయారవుతుంది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను ‘కరెంట్‌ బుకింగ్‌’లో చూపిస్తారు. రైలు బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు వరకు ఈ సీట్లను బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే రైలు, మార్గాన్ని బట్టి సమయాల్లో మార్పులు ఉండొచ్చు.

ఈ టికెట్లు వెయిటింగ్‌ లిస్ట్‌ లేదా ఆర్‌ఏసీ కింద ఉండవు. బుక్‌ చేసుకున్న వెంటనే కన్ఫర్మ్‌ టికెట్‌ లభిస్తుంది. దీనికి తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ అదనపు ఛార్జీలు ఉండవు. కొన్ని రైళ్లలో ఖాళీ సీట్లపై 10 నుంచి 30 శాతం వరకు తగ్గింపు కూడా లభించే అవకాశం ఉంది.

అయితే ఈ టికెట్లను రద్దు చేస్తే సాధారణంగా డబ్బు తిరిగి రాదు. అందుకే ప్రయాణం ఖరారైన తర్వాతే బుక్‌ చేసుకోవడం మంచిది.

ఖాళీ సీట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లోని ‘Charts Vacant’ ఆప్షన్‌లో చూడొచ్చు. రైలు నంబర్‌, ప్రయాణ తేదీ నమోదు చేస్తే ఖాళీగా ఉన్న కోచ్‌లు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. నచ్చిన సీటు అందుబాటులో ఉంటే అక్కడే బుక్‌ చేసుకోవచ్చు.
Advertisement
IRCTC
Current Booking
Tatkal Ticket
Indian Railways
Train Ticket Booking
Confirmed Seat

More Telugu News