అభివృద్ధి చేయగానే ప్రజలు ఓట్లు వేయరు.. నా అనుభవంతో చెబుతున్నా: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy says people do not vote just for development based on my experience
  • అభివృద్ధికి, ఓట్లకు సంబంధం లేదని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య
  • తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో జరిగిన అనుభవాన్ని పంచుకున్న వైనం
  • కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేసినా.. ఎన్నికల్లో మెజారిటీ భారీగా తగ్గిపోయిందని వెల్లడి
  • స్థానిక నేతలపై అసూయతో ప్రజలు తనకు వ్యతిరేకంగా ఓటు వేశారని వ్యాఖ్య‌
  • రాజకీయాల్లో గెలుపోటములకు ఫార్ములా ఉండదని స్పష్టీక‌ర‌ణ‌
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారా? వారి సమస్యలు తీరిస్తే ఓట్లు వేస్తారా? అనే అంశంపై తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అభివృద్ధి చేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం పొరపాటని, ఓట్లు మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఎదురైన ఒక సంఘటనను ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన సొంత నియోజకవర్గమైన పీలేరులోని 'మంచాలమంద' అనే మారుమూల గ్రామం గురించి కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. "ఆ గ్రామానికి 9 కిలోమీటర్ల వరకు సరైన రోడ్డు ఉండేది కాదు. 1989లో ఎమ్మెల్యే అయినా, 2002 వరకు నేను ఆ ఊరికి వెళ్లలేకపోయాను. దాదాపు 800-900 ఓట్లున్న ఆ గ్రామానికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ప్రజలకు సరైన ఇళ్లు, సాగునీటి వసతులు కూడా లేవు" అని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

2004లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన తెలిపారు. "ఆ ఒక్క గ్రామానికే 500 ఇళ్లు మంజూరు చేశాం. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా రెండు చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. కోటి రూపాయల ఖర్చుతో 9 కిలోమీటర్ల రోడ్డు వేశాం. దీంతో గ్రామానికి బస్సు సౌకర్యం కూడా వచ్చింది. అంతేకాకుండా, ఎంపీపీ పదవిని కూడా ఆ గ్రామస్థులకే ఇచ్చాం" అని తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు.

అయితే, ఎన్నికల ఫలితాలు మాత్రం ఆశ్చర్యపరిచాయని ఆయన అన్నారు. "ఇంత అభివృద్ధి చేయకముందు జరిగిన ఎన్నికల్లో ఆ గ్రామంలో మాకు 300 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ, ఇన్ని పనులు చేశాక జరిగిన ఎన్నికల్లో కేవలం 30 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది" అని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీనిపై తాము విశ్లేషణ చేసుకోగా అసలు కారణం తెలిసిందన్నారు. 

"మాతో ఉంటూ ఆ గ్రామానికి చెందిన కొందరు స్థానిక నేతలు ఆర్థికంగా ఎదిగారు. వారిపై మిగిలిన గ్రామస్థుల్లో అసూయ పెరిగింది. మాకు ఓటు వేస్తే ఆ నేతలకు పేరు వస్తుందని భావించిన ప్రజలు, వారిని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో నాకు వ్యతిరేకంగా ఓటు వేశారు" అని అసలు విషయం చెప్పారు.

రాజకీయాల్లో గెలుపునకు ఫార్ములా ఏమీ ఉండదని, ఇది చేస్తే గెలుస్తాం, అది చేస్తే ఓడిపోతాం అని చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా భగవంతుడి అనుగ్రహం ఉండాలని, రాజకీయాల్లో ఆ భగవంతుడు ఓటరు మహాశయులేనని వ్యాఖ్యానించారు. ఓటర్లు తలచుకుంటేనే గెలుస్తామని, లేదంటే ఓడిపోతామని తన రాజకీయ అనుభవ సారాంశాన్ని ఆయన పంచుకున్నారు.
Advertisement
Kiran Kumar Reddy
Andhra Pradesh Politics
Development vs Votes
Pileru Constituency
Election Strategy
Former CM Kiran Kumar Reddy

More Telugu News