ఏడాదిగా ఇంట్లోనే మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘ‌ట‌న‌

Womans Skeleton Found In Bengaluru Home She Died A Year Ago
  • బాగలగుంటెలోని ఇంట్లో 52 ఏళ్ల మహిళ అస్థిపంజరం లభ్యం
  • భర్త, కొడుకు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న దాక్షాయిణి
  • ఏడాదిగా కూతురు, అల్లుడు కూడా చూడటానికి రాలేదని సమాచారం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బెంగళూరు నగరంలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. బాగలగుంటె ప్రాంతంలోని ఓ డూప్లెక్స్ ఇంట్లో సుమారు ఏడాదిగా ఎవరి కంటా పడకుండా ఉన్న 52 ఏళ్ల మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలిని దాక్షాయిణిగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. బాగలగుంటెలోని హవనూర్ లేఅవుట్‌లో దాక్షాయిణి ఒంటరిగా నివసిస్తున్నారు. సుమారు 10 ఏళ్ల క్రితం ఆమె భర్త ఉమేశ్ మరణించారు. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో చనిపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు.

దాదాపు ఏడాది క్రితమే ఆమె మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఆమె కూతురు, అల్లుడు కూడా ఇంటికి వచ్చి చూడలేదని తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె మరణం ఇన్నాళ్లూ రహస్యంగానే ఉండిపోయింది.

సమాచారం అందుకున్న బాగలగుంటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి గల కచ్చితమైన కారణాలు, పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మహానగరంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Advertisement
Bengaluru
Bagalagunte
Skeleton found in house
Lone woman death
Bengaluru police investigation
Dakshayini

More Telugu News