పాక్‌లో మరో సైనిక తిరుగుబాటుకు యత్నాలా?.. హోంమంత్రి నఖ్వీ వ్యాఖ్యలతో కలకలం!

Pakistan Military Coup Rumors End As Home Minister Confirms Shehbaz Sharif Government Is Safe
  • షెహబాజ్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందన్న హోంమంత్రి
  • పరిపాలన వ్యవస్థ కుప్పకూలిందంటూ నఖ్వీ వ్యాఖ్యలతో మొదలైన దుమారం
  • సైన్యానికి సన్నిహితుడైన మంత్రి వ్యాఖ్యలతో పెరిగిన అనుమానాలు
  • తన వ్యాఖ్యలు పాత వ్యవస్థ గురించేనని, ప్రభుత్వంపై కాదని నఖ్వీ వివరణ
పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైన్యం మరోసారి అధికారాన్ని చేపట్టనుందంటూ కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ తెరదించారు. తన వ్యాఖ్యల కారణంగానే చెలరేగిన ఈ రాజకీయ తుపానుపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని, కూలిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో ఈ ప్రచారానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.

సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్‌కు అత్యంత సన్నిహితుడిగా, సైన్యం 'బ్లూ-ఐడ్ బాయ్'గా పేరుగాంచిన మొహ్సిన్ నఖ్వీ, ఇటీవల జరిగిన 'పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్'లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 80 ఏళ్లుగా ఉన్న పరిపాలన వ్యవస్థ పూర్తిగా ‘కుప్పకూలిపోయింది’ అని అన్నారు. అంతేకాకుండా, దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని తాను బయటపెట్టానని, అందులో న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. సైన్యానికి దగ్గరి వ్యక్తి అయిన నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేయడంతో, షెహబాజ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం రంగం సిద్ధం చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది.

నఖ్వీ వ్యాఖ్యలపై షెహబాజ్ షరీఫ్ కేబినెట్‌లోని మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. నఖ్వీకి జవాబుదారీతనం లేదని, ముందుగా తన శాఖలో మార్పులు చేసుకోవాలని చురక అంటించారు. మరోవైపు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పీపీపీ పార్టీ నేతలు నఖ్వీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వంలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

వ్యవస్థాగతంగా కలకలం రేగడం, ప్రభుత్వ మార్పిడి ప్రచారం జోరందుకోవడంతో మొహ్సిన్ నఖ్వీ వెనక్కి తగ్గారు. తాను చేసిన ‘వ్యవస్థ కూలిపోయింది’ అనే వ్యాఖ్య ప్రస్తుత షెహబాజ్ ప్రభుత్వం గురించి కాదని, గడిచిన 80 ఏళ్లుగా కొనసాగుతున్న పాత పరిపాలన నమూనాను ఉద్దేశించి మాత్రమే అని వివరణ ఇచ్చారు. "రోజుకు 14 నుంచి 16 గంటలు కష్టపడి పనిచేసే ప్రధాని షెహబాజ్‌కు మెరుగైన వ్యవస్థ అందిస్తే దేశాన్ని వందరెట్లు ముందుకు తీసుకెళ్తారు. ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలాన్ని (2029 వరకు) విజయవంతంగా పూర్తి చేస్తుంది" అని నఖ్వీ పేర్కొనడంతో, పాక్ రాజకీయాల్లో చెలరేగిన సంక్షోభం ప్రస్తుతానికి సద్దుమణిగింది.
Advertisement
Shehbaz Sharif
Mohsin Naqvi
Pakistan Military Coup
Pakistan Politics
General Asim Munir
Pakistan Government Stability

More Telugu News