Advertisement

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అర్ధాంగి అన్నా కొణిదెల ఉదారత.. బ‌ర్త్‌డే సందర్భంగా కీల‌క‌ నిర్ణయం

Anna Konidela Pawan Kalyans wife shows generosity with key decision on her birthday
  • పుట్టినరోజు సందర్భంగా విశాఖ జూలో రెండు జంతువుల దత్తత
  • ఏడాది పాటు ఏనుగు, పులి సంరక్షణకు రూ. 6.30 లక్షల విరాళం
  • అన్నా కొణిదెల నిర్ణయం స్ఫూర్తిదాయకమన్న జూ అధికారులు
  • దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని వెల్లడి
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల తన ఉదారతను చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణకు నడుం బిగించారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో రెండు వన్యప్రాణులను ఏడాదిపాటు దత్తత తీసుకున్నారు. ఈ మేరకు జూ అధికారులకు రూ. 6.30 లక్షల విరాళాన్ని అందించారు. ఈ నెల‌లో అన్నా కొణిదెల పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. జూలోని ఆసియాటిక్ ఏనుగు సంరక్షణ కోసం రూ. 4.30 లక్షలు, రాయల్ బెంగాల్ టైగ‌ర్‌ పోషణ కోసం రూ. 2 లక్షలు వెరసి మొత్తం రూ. 6.30 లక్షల చెక్‌ను జూ యాజమాన్యానికి అందజేశారు. ఈ విరాళాన్ని స్వీకరించిన జూ క్యూరేటర్ డాక్టర్ జి. మంగమ్మ, అన్నా కొణిదెల తరఫున వచ్చిన ప్రతినిధులకు జంతు దత్తత ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ నిధులను ఏడాదిపాటు ఏనుగు, పులి సంరక్షణ, సంపూర్ణ పోషణ, వైద్య అవసరాల కోసం వినియోగిస్తామని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ.. పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. అన్నా కొణిదెల తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. జూలోని జంతువుల దత్తత కార్యక్రమంలో ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలతో పాటు సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

జంతువులను దత్తత తీసుకోవడం ద్వారా వన్యప్రాణి సంరక్షణలో పాలుపంచుకోవచ్చని, దత్తత తీసుకున్న వారి పేర్లను ఆ జంతువుల ఎన్‌క్లోజర్ల వద్ద ప్రదర్శిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఇలా విరాళాలు అందించిన వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G(5) కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చని ఆమె వివరించారు. దత్తత తీసుకున్న వారికి జూ అధికారులు అధికారిక సర్టిఫికేట్, ఉచిత ఎంట్రీ పాస్‌లు కూడా అందిస్తారు.
Advertisement
Anna Konidela
Pawan Kalyan
Indira Gandhi Zoological Park
Animal Adoption
Visakhapatnam Zoo
Wildlife Conservation

More Telugu News