‘యానిమల్‌’లాంటి సినిమాలు ఇక చేయొద్దు.. రణ్‌బీర్‌కు ‘మహాభారత్‌ కృష్ణుడి’ విజ్ఞప్తి

Ranbir Kapoor advised by Nitish Bharadwaj to avoid movies like Animal
  • ఎంత పారితోషికం ఇచ్చినా అలాంటి సినిమాల్లో నటించొద్దన్న నితీశ్‌ భరద్వాజ్‌
  • ‘రామాయణ’ ట్రైలర్‌పై నితీశ్‌ ప్రశంసలు
  • డైరెక్టర్‌ నితీశ్‌ తివారీపై ప్రశంసల జల్లు
  • సీతగా సాయిపల్లవిని ఆదరిస్తారని ఆశాభావం
  • నవంబర్‌ 8న విడుదల కానున్న ‘రామాయణ’
బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌కు ప్రముఖ నటుడు నితీశ్‌ భరద్వాజ్‌ కీలక సూచన చేశారు. ‘యానిమల్‌’ వంటి సినిమాల్లో ఇకపై నటించొద్దని, తన వాణిని కలుషితం చేసుకోవద్దని కోరారు. త్వరలో విడుదల కానున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్‌పై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ సంస్కృతి, విలువలను కాపాడే బాధ్యత ఇప్పుడు రణ్‌బీర్‌పై ఉందని పేర్కొన్నారు.

బీఆర్‌ చోప్రా రూపొందించిన టెలివిజన్‌ ధారావాహిక ‘మహాభారత్‌’లో శ్రీకృష్ణుడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నితీశ్‌ భరద్వాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రామాయణ’ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు నితీశ్‌ తివారీ ప్రపంచ సినిమాకు భారత్‌ అందించే మరో గొప్ప బహుమతిగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ అవార్డు గెలిచే స్థాయి కలిగి ఉందని వ్యాఖ్యానించారు.

వీఎఫ్‌ఎక్స్‌, ఏఐ సాయంతో అద్భుతమైన ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించారని నితీశ్‌ కొనియాడారు. నిర్మాణ రూపకల్పన, సినిమాటోగ్రఫీకి ఎన్నో అవార్డులు వస్తాయని చెప్పారు. హాలీవుడ్‌ సంగీత దిగ్గజం హాన్స్‌ జిమ్మర్‌ భారతీయ సినిమాతో కలిసి పనిచేయడం గర్వకారణమని పేర్కొన్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఇద్దరూ భారతీయ సినీ రంగంలోని అగ్ర నటులుగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. యశ్‌కు ప్రపంచ సినీ రంగంలోకి స్వాగతం పలికారు.

రణ్‌బీర్‌ను ఉద్దేశిస్తూ నితీశ్‌ ప్రత్యేక సందేశం ఇచ్చారు. నటుడిగా ఆయనంటే ఎప్పటి నుంచో ఇష్టమని చెప్పారు. ఇకపై భారతీయ వారసత్వం, సంస్కృతి, విలువలను నిలబెట్టే బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఎంత పెద్ద పారితోషికం ఇచ్చినా ‘యానిమల్‌’ లాంటి సినిమాలు చేయొద్దని కోరారు. భారతదేశంలో నటనకు అవకాశమిచ్చే గొప్ప కథలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే సీత పాత్రలో సాయిపల్లవిని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో తులసీదాస్‌ చౌపాయిల స్వరాలు కూడా వినిపిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ భారీ వసూళ్లు సాధించినా, మహిళలను చూపిన తీరు, అధిక హింస, రక్తపాతం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మరోవైపు నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ట్రైలర్‌ గురువారం విడుదలైంది. భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ చిత్రం 2026 నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Ranbir Kapoor
Nitish Bharadwaj
Animal movie
Ramayana movie trailer
Sai Pallavi
Nitesh Tiwari

More Telugu News