భారత స్పేస్‌ స్టేషన్‌పై కీలక అప్‌డేట్‌.. తొలి మాడ్యూల్‌ ఎప్పుడంటే..

Bharatiya Antariksha Station key update and first module launch timeline
  • 2028లో బీఏఎస్‌-01 మాడ్యూల్‌ ప్రయోగం
  • 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం పూర్తి చేయడమే లక్ష్యం
  • బీఏఎస్‌-01 రూపకల్పన పనులు పూర్తయినట్లు వెల్లడి
  • గగన్‌యాన్‌ కార్యక్రమంలో కీలక పురోగతి
  • మానవరహిత జీ1 మిషన్‌కు చివరి దశ ఏర్పాట్లు
  • దేశీయంగా కీలక అంతరిక్ష సాంకేతికతల అభివృద్ధికి ఆమోదం
భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి స్వదేశీ అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష స్టేషన్‌ (బీఏఎస్‌) దిశగా కీలక ముందడుగు పడింది. ఐదు మాడ్యూళ్లతో రూపొందనున్న ఈ అంతరిక్ష కేంద్రంలో తొలి మాడ్యూల్‌ బీఏఎస్‌-01ను 2028లో ప్రయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

రాజ్యసభలో కేంద్ర అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ వివరాలను వెల్లడించారు. బీఏఎస్‌-01కు సంబంధించిన ప్రాథమిక రూపకల్పన సమీక్ష, సిస్టమ్‌ ఇంజినీరింగ్‌ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ మాడ్యూల్‌కు సంబంధించిన 31 ప్రాథమిక డిజైన్‌ పత్రాలను విడుదల చేశామని వెల్లడించారు. ఉపవ్యవస్థల రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయని, మానవ అంతరిక్ష కార్యక్రమానికి అవసరమైన ప్రోటో హార్డ్‌వేర్‌ అభివృద్ధి కొనసాగుతోందని వివరించారు.

గగన్‌యాన్‌ కార్యక్రమంలోనూ కీలక పురోగతి సాధించినట్లు మంత్రి తెలిపారు. మానవులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికిల్‌ (హెచ్‌ఎల్‌వీఎం3), ఆర్బిటల్‌ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌, గ్రౌండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫ్లైట్‌ ఆపరేషన్స్‌, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌, వ్యోమగాముల రికవరీ వ్యవస్థల అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు.

గగన్‌యాన్‌కు ముందస్తు పరీక్షలుగా చేపట్టిన టీవీ-డీ1, ఐఏడీటీ-01, ఐఏడీటీ-02 మిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. తొలి మానవరహిత గగన్‌యాన్‌ మిషన్‌ జీ1కు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. డాకింగ్‌ వ్యవస్థకు అవసరమైన విద్యుత్‌, యాంత్రిక అనుసంధానాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అంతరిక్షంలో ఇంధనం నింపే విధానానికి సంబంధించిన నమూనా పరీక్ష కూడా విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు.

మానవ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఫ్లైట్‌ సూట్‌, వ్యూపోర్ట్‌, క్రూ సీటు, డాకింగ్‌ టెక్నాలజీ వంటి కీలక సాంకేతిక పరిజ్ఞానాలను స్వదేశంలోనే అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం గగన్‌యాన్‌ కోసం వీటిని బయటి సంస్థల నుంచి సమకూర్చుకుంటున్నామని చెప్పారు. ఈ సాంకేతికతల అభివృద్ధితో మిగిలిన నాలుగు మాడ్యూళ్ల రూపకల్పనకు బలమైన పునాది ఏర్పడుతుందని, మానవ అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ స్వావలంబన సాధించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
Advertisement
Bharatiya Antariksha Station
ISRO
Jitendra Singh
Gaganyaan Mission
BAS 01 Module
Indian Space Station

More Telugu News