'వందేమాతరం' దేవతల ఆరాధనను ప్రతిబింబిస్తుంది: ఒవైసీ

Asaduddin Owaisi says Vande Mataram reflects the worship of deities
  • పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందిన వందేమాతరం
  • జనగణమన పాడినప్పుడు దేశ వైవిధ్యం కళ్లముందు కదలాడుతుందన్న ఒవైసీ
  • వందేమాతరం ఒక పూజా విధానాన్ని చూపుతుందని వ్యాఖ్య

పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన వందేమాతరం బిల్లు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ చట్టం దేశ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


'జనగణమన', 'వందేమాతరం'ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన జాతీయ గీతమైన 'జనగణమన' పాడినప్పుడు భారతదేశ వైవిధ్యం, ఇక్కడి ప్రజల ఐక్యత కళ్లముందు కదలాడుతాయని... అయితే 'వందేమాతరం' మాత్రం ఒక నిర్దిష్ట పూజా విధానాన్ని, దేవతల ఆరాధనను ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు.


ఈ సందర్భంగా 1950 నాటి చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ.. నాటి తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి పార్లమెంటరీ తీర్మానం లేకుండానే వందేమాతరానికి జాతీయ గేయ హోదా ఇవ్వడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. అసలు మన చట్టాల్లో గానీ, రాజ్యాంగంలో గానీ 'జాతీయ గేయం' అనే పదానికి కచ్చితమైన వర్గీకరణ లేదా నిర్వచనమే లేదని ఆయన గుర్తుచేశారు.


ప్రస్తుతం కేంద్రం తెచ్చిన ఈ చట్టం రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులపై దాడి చేయడమేనని ఒవైసీ ఆరోపించారు. ముఖ్యంగా ఆర్టికల్స్ 25, 26, 29 కింద లభించే మత స్వేచ్ఛను, సాంస్కృతిక హక్కులను ఈ బిల్లు కాలరాస్తోందని ధ్వజమెత్తారు.

Advertisement
Asaduddin Owaisi
Vande Mataram Bill
Indian Parliament
AIMIM Chief
Constitution of India
Religious Freedom Rights

More Telugu News