సినిమాను మూడేళ్లు తీయడమే పెద్ద దరిద్రం: నిర్మాత ధీరజ్ మొగిలినేని
- కొందరు దర్శకులు అనవసరంగా సినిమాకు మూడేళ్ల సమయం తీసుకుంటున్నారన్న ధీరజ్
- దీని వల్ల హీరోలు ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్‌కు పరిమితమవుతున్నారని వ్యాఖ్య
- తక్కువ సమయంలో సినిమా పూర్తయితేనే నిర్మాత సురక్షితంగా ఉంటాడన్న ధీరజ్
'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం విజయం పొందిన ఆనందంలో ఉన్న యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమ తీరుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో ప్రాజెక్టుల ఆలస్యంపై ఆయన ఘాటుగా స్పందిస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
"టాలీవుడ్‌లో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే.. ఒక్కో సినిమాను మూడేళ్ల పాటు తీస్తూ పోవడమే. ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్లు తమ భారీ ప్రాజెక్టుల కోసం మూడేళ్లు సమయం తీసుకుంటే అందులో ఒక అర్థం ఉంది. కానీ కొందరు ఇతర దర్శకులు కూడా అనవసరంగా సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు" అని విమర్శించారు.
ఈ తీరు వల్ల హీరోలు ఏళ్ల తరబడి ఒకే ప్రాజెక్ట్‌కు పరిమితమైపోతున్నారని, అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారని ధీరజ్ తెలిపారు. ఒక సినిమాను సాధ్యమైనంత వరకు 10 నెలల్లో లేదా మహా అయితే ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తేనే నిర్మాత సురక్షితంగా ఉంటాడని, ఇండస్ట్రీ కూడా ఆరోగ్యకరమైన దిశగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.