10 నిమిషాలు పక్షుల కిలకిలారావాలు వింటే చాలు.. ఒత్తిడి మాయం!

Birdsong for 10 minutes helps reduce stress and improve mental health
  • 106 మందిపై నిర్వహించిన అధ్యయనం
  • అడవి, పక్షుల శబ్దాల కలయికతో మెరుగైన ఫలితాలు
  • ట్రాఫిక్‌ శబ్దాలతో మానసిక ప్రశాంతత తగ్గుదల
  • పునరుద్ధరించిన అడవుల్లోనూ సమాన ప్రయోజనాలు
  • నగరాల్లో హరిత ప్రాంతాల అవసరాన్ని నొక్కిచెప్పిన అధ్యయనం
నగరాల రద్దీ, కాలుష్యం, ఒత్తిడి మధ్య కాసేపు పచ్చని అడవిలో కూర్చొని పక్షుల కిలకిలారావాలు వింటే మనసు ప్రశాంతంగా మారుతుందని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని శాస్త్రీయ అధ్యయనం కూడా నిర్ధారించింది. కేవలం 10 నిమిషాల పాటు పట్టణాల్లో పునరుద్ధరించిన అడవిలో పక్షుల కిలకిలారావాలు విన్న వారిలో ఒత్తిడి గణనీయంగా తగ్గడంతో పాటు సానుకూల భావోద్వేగాలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం ‘ఎన్విరాన్‌మెంటల్‌ కన్జర్వేషన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

అమెరికాలోని నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ నిల్స్‌ పీటర్సన్‌ నేతృత్వంలోని బృందం 106 మందిపై ఈ పరిశోధన నిర్వహించింది. పునరుద్ధరించిన అడవి, పట్టణ ప్రాంతం అనే రెండు వాతావరణాల్లో పాల్గొన్న వారిని కూర్చోబెట్టి హెడ్‌ఫోన్లతో పక్షుల కిలకిలారావాలు, ట్రాఫిక్‌ శబ్దాలను వినిపించారు. అడవిలో పక్షుల శబ్దాలు విన్నవారిలోనే ఒత్తిడి అత్యల్పంగా ఉండగా, సానుకూల భావాలు అత్యధికంగా నమోదయ్యాయి. పట్టణ వాతావరణంలో ట్రాఫిక్‌ శబ్దాలు విన్నవారిలో మాత్రం మానసిక ప్రశాంతత అత్యల్పంగా కనిపించింది.

పచ్చని వాతావరణం ఒక్కటే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని గత అధ్యయనాలు చెప్పినా, ఈ పరిశోధనలో పక్షుల కిలకిలారావాలు ఆ ప్రయోజనాన్ని మరింత పెంచుతున్నట్లు తేలింది. ప్రకృతి మధ్య గడపడం వల్ల మానసిక అలసట తగ్గడంతో పాటు భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. ప్రత్యేక వ్యాయామాలు, పరికరాలు అవసరం లేకుండానే ప్రకృతి శబ్దాలు మనసుకు ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.

ఈ అధ్యయనంలో ఉపయోగించిన అడవి పురాతన అటవీ ప్రాంతం కాదని, 2002 నుంచి 2006 మధ్య పునరుద్ధరించిన అటవీ ప్రాంతమని పరిశోధకులు వెల్లడించారు. అంటే కొత్తగా అభివృద్ధి చేసిన పచ్చని ప్రదేశాలు కూడా ప్రజల మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. నగరాల్లో మరిన్ని హరిత ప్రాంతాలు, పక్షుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తే జీవవైవిధ్యం పెరగడమే కాకుండా ప్రజల మానసిక ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
Advertisement
Birdsong
Stress relief
Mental health
Nature therapy
North Carolina State University
Environmental Conservation

More Telugu News