సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
- కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఇప్పటికే అల్లు అర్జున్ కు మినహాయింపు
- అనారోగ్య సమస్యల కారణంగా విచారణకు హాజరుకాని ముగ్గురు నిందితులు
- డిజిటల్ ఆధారాలను నిందితుల న్యాయవాదులకు అందించాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద చోటుచేసుకున్న విషాదకర తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణను నాంపల్లి కోర్టు ఆగస్టు 17కి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంలో న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అనారోగ్య సమస్యల కారణంగా ఈ కేసులోని ముగ్గురు నిందితులు కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఛార్జ్‌షీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయస్థానం... ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, వీడియో ఫుటేజీలు, పత్రాల కాపీలను తదుపరి విచారణ నాటికి నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.