ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సులు ఎందుకు అన్నారు: జగన్ పై ఎంపీ కలిశెట్టి ఫైర్
- గతంలో జగన్ భోగాపురం గురించి హేళనగా మాట్లాడారన్న కలిశెట్టి
- జగన్ క్రెడిట్ చోరీ చేస్తే జైలుకే వెళ్లాల్సి ఉంటుందని ఎద్దేవా
- డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్న ఎంపీ
భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదమని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ భోగాపురం వచ్చి... "ఎర్రబస్సు సరిగ్గా రాని ఈ ప్రాంతానికి ఎయిర్‌పోర్ట్, ఎయిర్ బస్సులు ఎందుకు?" అంటూ తీవ్రంగా అవహేళన చేశారని ఎంపీ గుర్తుచేశారు. జగన్ సాధించిన 'ప్రత్యేక క్రెడిట్'ను ఎవరూ దొంగిలించరని, ఒకవేళ ఆయన క్రెడిట్‌ను ఎవరైనా చోరీ చేస్తే చివరకు జైలుకే వెళ్లాల్సి వస్తుందంటూ ఘాటుగా సెటైర్ వేశారు. జగన్ మాటలు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇక త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోందని అప్పలనాయుడు స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో నారా లోకేశ్ నాయకత్వంలో విద్యాశాఖ ఎంతో పారదర్శకంగా పనిచేస్తోందని, డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగకుండా నిష్పాక్షికంగా నిర్వహించారని చెప్పారు. లోకేశ్ విసిరిన సవాలును స్వీకరించలేక జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు.