మన్మోహన్ సింగ్ పై ఉన్న క్రిమినల్ కేసును శాశ్వతంగా క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు
- బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో మన్మోహన్ పై కేసు
- సీబీఐ నివేదికను పక్కన పెట్టి ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడంలో బలమైన కారణాలు కనిపించడం లేదన్న సుప్రీంకోర్టు
- ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌పై నమోదైన క్రిమినల్ కేసును, ఆనాటి ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఈరోజు పూర్తిగా రద్దు చేసింది. విచారణ సంస్థల ఆధారాలను తోసిపుచ్చి స్పెషల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ కేసును క్లోజ్ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన రెండు విభిన్న క్లోజర్ రిపోర్టుల్లో మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని, అయినప్పటికీ ట్రయల్ కోర్టు సీబీఐ నివేదికను పక్కనబెట్టి సమన్లు జారీ చేయడంలో ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేసు నేపథ్యం
2005లో ఒడిశాలోని తలబిరా-II బొగ్గు బ్లాక్ కేటాయింపుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి. పరాఖ్‌లకు 2015లో నాటి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, అత్యున్నత న్యాయస్థానం ఆనాడే సమన్ల అమలుపై స్టే విధించింది. ప్రధానిగా తన విధుల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నానని, ఇందులో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. తాజాగా సీబీఐ అందించిన క్లోజర్ రిపోర్టును ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పునివ్వడంతో మాజీ ప్రధానిపై ఉన్న ప్రధాన ఆరోపణలు తొలగిపోయాయి.