పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం.. లోక్‌సభలో పరీక్షల సవరణ బిల్లుకు ఆమోదం

Lok Sabha passes Public Examinations Amendment Bill to curb paper leaks
  • పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026కు లోక్‌సభ ఆమోదం
  • పరీక్షల అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా
  • ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.. మూడు నెలల్లోగా తీర్పునకు నిబంధన
  • నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థుల నిరసనలు, మంత్రి రాజీనామా నేపథ్యంలో ఈ పరిణామం
  • పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడి
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన పరీక్షల పేపర్ లీకేజీలు, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 'పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు-2026'కు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు రోజుల పాటు వాడివేడిగా సాగిన చర్చల అనంతరం వాయిస్ ఓటు ద్వారా ఈ కీలక బిల్లును సభ ఆమోదించింది. పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

2024 నాటి చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన ఈ కొత్త బిల్లులో అత్యంత కఠినమైన నిబంధనలను చేర్చారు. దీని ప్రకారం పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే దోషులకు గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేగాక దోషుల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుంది. ఈ తరహా కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్టులు మూడు నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాల్సి ఉంటుంది.

ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

నీట్ అక్రమాలు, ఇతర పరీక్షల్లో అవ‌క‌త‌వ‌కాలపైన జులై 20న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో 'సంసద్ చలో' పేరిట వందలాది మంది విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులై 25న తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజకీయ ఒత్తిడి, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని తీసుకురావడం గమనార్హం.
Advertisement
Public Examinations Amendment Bill 2026
Lok Sabha
Paper Leak Law
NEET Controversy
Dharmendra Pradhan
Exam Fraud Punishment

More Telugu News