రేవంత్, కిషన్ రెడ్డి కారణంగా సింగరేణి అస్తిత్వం ప్రమాదంలో పడింది: కవిత

Singareni existence in danger due to Revanth and Kishan Reddy says Kavitha
  • సింగరేణికే బొగ్గు బ్లాకులు కేటాయించాలనే విన్నపాలను పట్టించుకోవడం లేదన్న కవిత
  • టీఎస్ జెన్‌కోను రంగంలోకి దింపడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్న
  • ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు డ్రామా ఆడుతున్నారని విమర్శ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల తీరు వల్ల తెలంగాణకే గర్వకారణమైన సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులను కేటాయించాలన్న విజ్ఞప్తులను పట్టించుకోకుండా... మణుగూరు పీకేవోసీపీ (PKOCP) బొగ్గు బ్లాక్ వేలం నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు.


సింగరేణి నేరుగా వేలంలో పాల్గొంటుందని పైకి ప్రకటించిన ప్రభుత్వం, తెరవెనుక మాత్రం టీఎస్ జెన్‌కోను పోటీలోకి తెచ్చేలా కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తోందని కవిత మండిపడ్డారు. బొగ్గు తవ్వకాల్లో శతాబ్దాల అనుభవం, ప్రావీణ్యం ఉన్న సింగరేణి సంస్థకు పోటీగా.. ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్‌కోను రేసులోకి దింపడం వెనుక ఉన్న మర్మమేమిటో రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.


జెన్‌కో ద్వారా బొగ్గు బ్లాకులను దక్కించుకుని, ఆ తర్వాత అనుభవం లేదనే నెపంతో వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఈ ముసుగు డ్రామా ఆడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. సింగరేణి భవిష్యత్తు, అభివృద్ధిపై కిషన్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా నేరుగా కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ వేలం పోటీ నుంచి టీఎస్ జెన్‌కోను రాష్ట్ర ప్రభుత్వం తప్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Kalvakuntla Kavitha
Singareni Collieries
Revanth Reddy
Kishan Reddy
Manuguru Coal Block Auction
TS Genco

More Telugu News