నల్లమలలో పులి గాండ్రింపు శాశ్వతం చేస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan says tiger roar in Nallamala will be made permanent
  • పులుల దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందన 
  • తూర్పు కనుమల్లోకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి నాలుగు ఆడ పులులు
  • నాగార్జునసాగర్ రిజర్వ్‌లో వేట నిరోధక శిబిరాలు 150కి పెంపు
  • గిరిజన యువతకు 800 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటన
  • పులుల సంరక్షణలో ఏపీని ఆదర్శంగా నిలుపుతామన్న డిప్యూటీ సీఎం
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటనలు చేశారు. నల్లమల అడవుల్లో పులి గాండ్రింపును శాశ్వతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పులుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవానికి చారిత్రక అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.

అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన స్పందిస్తూ.. జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘమని అన్నారు. పులులను కాపాడుకోవడం అంటే అడవులను, జలవనరులను, భావితరాల వారసత్వాన్ని కాపాడుకోవడమేనని పేర్కొన్నారు. తూర్పు కనుమల ప్రాంతంలో పులుల సంఖ్యను, జన్యు వైవిధ్యాన్ని పెంచేందుకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి నాలుగు ఆడ పులులను రాష్ట్రానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇందుకు సహకరించిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది రాష్ట్ర పులుల సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు.

పులుల సంరక్షణ చర్యలను మరింత బలోపేతం చేసేందుకు దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్ టీఆర్) పరిధిలో వేట నిరోధక శిబిరాల సంఖ్యను 89 నుంచి 150కి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా నిఘా వ్యవస్థ పటిష్ఠం కావడంతో పాటు, సుమారు 800 మంది గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. రాష్ట్రంలోని ఎన్ఎస్ టీఆర్-శేషాచలం అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం 68 పులులు, 11 పులి పిల్లలు ఉన్నాయని, ఇది ప్రభుత్వ సంరక్షణ చర్యలకు నిదర్శనమని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పులుల సంరక్షణకు శాస్త్రీయ పద్ధతులను అమలు చేస్తున్నామని, డ్రోన్లు, కెమెరా ట్రాప్‌లతో నిఘాను పటిష్ఠం చేశామని తెలిపారు. నల్లమల అడవుల్లో గౌర్ (అడవి దున్న) జంతువుల పునఃప్రవేశం, పాపికొండల అటవీ ప్రాంతంలో ఆడ పులుల ప్రవేశం వంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, గిరిజన సమాజాలు, పర్యావరణ ప్రేమికులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
Pawan Kalyan
Nallamala Forest
Tiger Conservation
Nagarjunasagar Srisailam Tiger Reserve
International Tiger Day
Tiger Translocation

More Telugu News