ఆ కంటెంట్ వెంటనే తొలగించండి.. కానీ భవిష్యత్‌పై హామీ ఇవ్వలేం: యువరాజ్‌ సింగ్‌ కేసులో హైకోర్టు

Yuvraj Singh Case Delhi High Court Orders Removal Of Offensive Content But Refuses Blanket Ban
  • యువరాజ్ సింగ్ పర్సనాలిటీ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టులో విచారణ
  • అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ
  • భవిష్యత్తులో వచ్చే కంటెంట్‌పై బ్లాంకెట్ ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ
  • సోషల్ మీడియా సంస్థలు న్యాయనిర్ణేతలు కాదని వ్యాఖ్యానించిన కోర్టు
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టులో పాక్షిక ఊరట లభించింది. అత‌ని 'పర్సనాలిటీ హక్కుల'ను ఉల్లంఘిస్తూ ఆన్‌లైన్‌లో ఉన్న కొన్ని అభ్యంతరకర కంటెంట్‌లను తొలగించాలని ఆదేశిస్తూనే, భవిష్యత్తులో అప్‌లోడ్ అయ్యే కంటెంట్‌పై ఏకపక్షంగా నిషేధం (బ్లాంకెట్ ఇంజంక్షన్) విధించడానికి నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

యువరాజ్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్న నిర్దిష్ఠ‌ యూఆర్ఎల్‌ల‌లో ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను 48 గంటల్లోగా తొలగించాలని, వాటిని అప్‌లోడ్ చేసిన వారికి కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వారు గడువులోగా స్పందించని పక్షంలో యువరాజ్ సింగ్ సంబంధిత సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించవచ్చని సూచించింది. అప్పుడు ఆయా సంస్థలు 36 గంటల్లోగా ఆ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది.

అయితే, భవిష్యత్తులో అప్‌లోడ్ అయ్యే ఇలాంటి కంటెంట్‌ను కూడా తొలగించాలని సాధారణ ఆదేశాలు ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు. "ప్రస్తుతానికి ఈ దావాలో ఉన్న యూఆర్ఎల్‌ల‌ తొలగింపునకు మాత్రమే ఆదేశిస్తున్నాను. భవిష్యత్తులో మరేదైనా అభ్యంతరకర కంటెంట్ కనిపిస్తే, ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోండి. అది ఉల్లంఘన కిందకు వస్తుందో లేదో పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తాను" అని జస్టిస్ సింగ్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు న్యాయనిర్ణేతలు కావని, ఏది ఉల్లంఘన కంటెంటో అవే స్వయంగా నిర్ణయించలేవని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

తన పేరు, ఫొటో, పోలికలు, గుర్తింపును ఆన్‌లైన్ వేదికలపై వాణిజ్య ప్రయోజనాల కోసం అనధికారికంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ యువరాజ్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తన పేరుతో నకిలీ వస్తువులు అమ్మడం, అభ్యంతరకర కంటెంట్ పెట్టడం వంటి చర్యల నుంచి రక్షణ కల్పించాలని కోరాడు.

ఇటీవలి కాలంలో 'పర్సనాలిటీ హక్కుల' పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్న ప్రముఖుల జాబితాలో యువరాజ్ కూడా చేరాడు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, నటులు అల్లు అర్జున్, నాగార్జున, వరుణ్ ధావన్, కాజోల్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, నాగ చైతన్య, గాయకుడు జుబిన్ నౌటియాల్, సినీ నిర్మాత కరణ్ జోహార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వంటి ఎందరో తమ గుర్తింపును దుర్వినియోగం చేయకుండా కోర్టు నుంచి రక్షణ పొందారు.
Advertisement
Yuvraj Singh
Delhi High Court
Personality Rights
Social Media Content Removal
Celebrity Identity Protection
Intellectual Property Rights

More Telugu News