ఉద్యమాలు చేయాలనుకునే ఏ విద్యార్థైనా పోలీసులను ఎదుర్కోవాల్సిందే: నడ్డా

JP Nadda defends Delhi Police action at CPM office in Rajya Sabha
  • రాజ్యసభలో ఢిల్లీ పోలీసుల చర్యలపై దుమారం
  • ఐషే ఘోష్‌ ఘటనను ప్రస్తావించిన ప్రతిపక్షం
  • ‘విద్యార్థి ఉద్యమకారులు పోలీసులను ఎదుర్కోవాల్సిందే’ అన్న నడ్డా
  • ఎమర్జెన్సీలో తాను కూడా అరెస్టయ్యానన్న కేంద్ర మంత్రి
  • పోలీసులపై చర్యలు కోరిన ఖర్గే
రాజ్యసభలో బుధవారం ఢిల్లీ పోలీసుల చర్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు వెళ్లి మాజీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన ఘటనను ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో ఆందోళన, నినాదాలు కొనసాగాయి. దీనిపై స్పందించిన రాజ్యసభ సభానేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఉద్యమాలు చేయాలనుకునే ఏ విద్యార్థైనా పోలీసులను ఎదుర్కోవాల్సిందే’’ అని అన్నారు.

సీపీఎం సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలో పాల్గొనడమే ఐషే ఘోష్‌ చేసిన తప్పని పేర్కొన్నారు. 2020-21 కేసులను చూపిస్తూ పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే జాతీయ రాజకీయ పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా దీన్ని ఖండిస్తూ, పార్టీ కార్యాలయంలోకి వెళ్లి నాయకురాలిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రతిపక్ష సభ్యుల విమర్శలకు సమాధానంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, తాను కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకుడినేనని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ కాలంలో పలుమార్లు అరెస్టయ్యానని చెప్పారు. చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యతని పేర్కొన్నారు. ఉద్యమాల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు పోలీసు చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్ష సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నినాదాలు కొనసాగడంతో గందరగోళం నెలకొంది. చివరకు ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.
Advertisement
JP Nadda
Aishe Ghosh
Rajya Sabha
Delhi Police
CPM Office
Student Protests

More Telugu News