నేర చరిత్ర లేని వారిపై చర్యలు వద్దు.. విద్యార్థుల ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court issues key orders on student protests no action against those without criminal history
  • విద్యార్థుల ఆందోళనలపై సిట్ కు దిశానిర్దేశం
  • అదుపులో ఉన్న మైనర్లను విడుదల చేయాలని ఆదేశం
  • ఎలక్ట్రానిక్ ఆధారాలు భద్రపరచాలని సూచన
  • కేంద్రం, ఏడు రాష్ట్రాలకు నోటీసులు
  • కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల బలప్రయోగం, పోలీసులపై జరిగిన దాడులపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అలాగే నేర చరిత్ర లేని విద్యార్థి నిరసనకారులపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల ఆరోపణలు ప్రాథమికంగా స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. ఈ అంశంపై కేంద్రంతో పాటు అసోం, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ఆందోళనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న మైనర్లను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేవలం నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో అరెస్టు చేసిన లేదా అదుపులో ఉంచిన విద్యార్థులకు నేర చరిత్ర లేకపోతే వారిని కూడా విడుదల చేయాలని స్పష్టం చేసింది. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్న వారికి ఈ రక్షణ వర్తించదని పేర్కొంది.

ఆందోళనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరా రికార్డింగులు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ వివరాలు, పీసీఆర్ లాగ్‌లు సహా అన్ని ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, డిజిటల్ డేటాను కూడా భద్రపరచాలని, అయితే ప్రస్తుతానికి వాటిని బహిర్గతం చేయవద్దని స్పష్టం చేసింది.

పోలీసు సిబ్బందిపై జరిగిన దాడులపైనా సమగ్ర దర్యాప్తు అవసరమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సుమారు 250 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. నిరసనల్లో సంఘవిద్రోహ శక్తులు చొరబడి ఉండే అవకాశం ఉందని, నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.
Advertisement
Supreme Court of India
NEET UG paper leak
Student protests
SIT investigation
Tushar Mehta
NEET exam row

More Telugu News