ఇకపై నా ప్రయాణం సాధారణంగా ఉండదు: పొలిటికల్ ఎంట్రీపై క్లూ ఇచ్చిన హీరో విశాల్
- నటుడిగా ప్రజల నుంచి ఎంతో అభిమానాన్ని పొందానన్న విశాల్
- మీ కోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నానని వ్యాఖ్య
- సమయం అనుకూలిస్తే ప్రజాక్షేత్రంలో నిలబడతానని వెల్లడి
కోలీవుడ్‌లో స్టార్ హీరోలంతా వరుసగా రాజకీయ బాట పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 'తమిళగ వెట్రి కళగం' పార్టీతో తుపాను సృష్టించిన విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మరోవైపు, ఇటీవల మరో హీరో ధనుష్ చేసిన కామెంట్స్ ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చకు తెరలేపాయి. తాజాగా ఈ జాబితాలో మాస్ హీరో విశాల్ కూడా చేరారు. ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సినిమా రంగంలో ఇన్నాళ్లూ సంపాదించుకున్న ప్రజాదరణను, మంచి పేరును ఇకపై ప్రజాసేవ కోసం ఉపయోగించాలని భావిస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. "ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నటుడిగా మీ నుంచి ఎంతో ప్రేమను, అభిమానాన్ని పొందాను. ఆ అభిమానానికి, ప్రేమకు ప్రతిఫలంగా మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని బలంగా నిశ్చయించుకున్నాను. ఇకపై నా ప్రయాణం గతంలో మాదిరి సాధారణంగా ఉండదు. నేరుగా, అత్యంత నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాను" అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే నడిగర్ సంగమ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యతల్లో తనదైన ముద్ర వేసిన విశాల్, గతంలోనూ ఆర్‌కే నగర్ ఉపఎన్నికలో పోటీకి యత్నించిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు సరిగా పనిచేయనందునే కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాల్సి వస్తోందని, త్వరలోనే తన రాజకీయ పయనానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని సూచించారు. ఇకపై తన అభిమాన సంఘాన్ని ప్రజా సేవ కోసం కూడా నడిపిస్తానని తెలిపారు. తన ఆలోచన వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవని... సమయం అనుకూలిస్తే ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో నిలబడతానని స్పష్టం చేశారు. విశాల్ వ్యాఖ్యలను బట్టి ఆయన త్వరలోనే సొంత పార్టీ ప్రకటన లేదా క్రియాశీల రాజకీయాల్లోకి దిగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.