20 మంది టీఎంసీ అసమ్మతి ఎంపీలతో సీఎం సువేందు అధికారి భేటీ
- ఉత్కంఠభరితంగా పశ్చిమబెంగాల్ రాజకీయాలు
- టీఎంసీ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 20 మంది అసమ్మతి ఎంపీలు
- ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు యత్నిస్తున్న తిరుగుబాటు ఎంపీలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రతిపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో తీవ్ర వర్గపోరు నెలకుంది. టీఎంసీ అగ్రనాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన దాదాపు 20 మంది అసమ్మతి ఎంపీలు సీఎం సువేందు అధికారితో ఢిల్లీలో కీలక సమావేశం కానున్నారు. వీరంతా పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
అసమ్మతి ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం పశ్చిమ బెంగాల్ రాజకీయాలో పెద్ద కలకలాన్నే రేపింది. ఈ తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ప్రత్యేక విభాగంగా గుర్తించాలని లేఖ అందించే ఆలోచనలో ఉన్నారు. యాంటీ-డిఫెక్షన్ చట్టం (శిక్షార్హమైన పక్షాంతరం నిరోధక చట్టం) పరిధిలోకి రాకుండా ఉండేందుకు కావలసిన సంఖ్యను సేకరించే పనిలో వీరు ఉన్నారు. మరోవైపు, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈ ఎంపీలపై తీవ్ర చర్యలకు సిద్ధమవుతుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే నేతలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు.