ప్రభుత్వ బడి నుంచి మిషన్ ‘శక్తిశాట్’కు ఎంపిక... విద్యార్థిని జెస్సీకి మంత్రి లోకేశ్ అభినందనలు

Selected for Mission ShaktiSat from government school Minister Lokesh congratulates student Jessy
  • గ్లోబల్ లూనార్ మిషన్ ‘శక్తిశాట్’కు ఎంపికైన విద్యార్థిని జెస్సీ
  • మంత్రి నారా లోకేశ్‌ను కలిసి అభినందనలు అందుకున్న వైనం
  • జెస్సీ భవిష్యత్ ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని భరోసా
  • ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ ఘనత సాధించిన తూర్పుగోదావరి విద్యార్థిని
  • రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచావంటూ జెస్సీని కొనియాడిన మంత్రి
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అసాధారణ ప్రతిభతో ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం విద్యార్థిని కందుల జెస్సీ, సోమవారం ఉండవల్లిలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసింది. ఈ సందర్భంగా జెస్సీని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి, ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ధవళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ, ‘మిషన్ శక్తిశాట్’కు భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో ఒకరిగా నిలిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా ఆమె రికార్డు సృష్టించింది. తన పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లో చేసిన ప్రయోగాలే తనకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంచాయని జెస్సీ మంత్రికి వివరించింది. ఏడో తరగతి నుంచే స్పేస్ సైన్స్ పట్ల ఆకర్షితురాలినయ్యానని, మిషన్ శక్తిశాట్‌లో భాగంగా 21 మాడ్యూల్స్‌లో 550 సెషన్ల శిక్షణ తీసుకున్నానని తెలిపింది. భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్‌గా స్థిరపడటమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.

జెస్సీ సాధించిన విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 22 క్లస్టర్లలో ‘స్పేస్ సిటీ క్లస్టర్’ కూడా ఉందని, అంతరిక్ష రంగంలో యువతకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. అనంతరం మంత్రి, మిషన్ శక్తిశాట్ పోస్టర్‌ను ఆవిష్కరించి, జెస్సీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిషన్ శక్తిశాట్ డైరెక్టర్, స్పేస్ కిడ్స్ ఇండియా సీఈవో డాక్టర్ శ్రీమతి కేశన్, సంస్కార ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్న తిరునగరి, పాఠశాల ఉపాధ్యాయురాలు కె.మణిమాల తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Kandula Jessy
Mission ShaktiSat
Nara Lokesh
Andhra Pradesh Education
Space Kidz India
Lunar CubeSat

More Telugu News