హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. స్పందించిన కవిత

High Court orders removal of HYDRA Commissioner Ranganath Kavitha reacts
  • పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో రంగనాథ్ క్షమాపణను తిరస్కరించిన హైకోర్టు
  • ఇది ప్రభుత్వ నిరంకుశ పోకడలకు నిదర్శనమన్న కవిత
  • పేదలకు, ధనికులకు వేర్వేరు న్యాయాలు ఉండకూడదన్న కవిత
హైడ్రా కమిషనర్‌గా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో, మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత 'ఎక్స్' వేదికగా స్పందించారు.

ప్రస్తుత ప్రభుత్వ నిరంకుశ ధోరణులను హైకోర్టు తీర్పు ఎండగట్టిందని, అక్రమ నిర్మాణాల సాకుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు వంటిదని కవిత విమర్శించారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు.

న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రా పనితీరుపై గతంలోనే హైకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఆ సంస్థ తీరులో మార్పు రాలేదని ఆమె ఆక్షేపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవాలను గ్రహించాలని, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరొక న్యాయం అన్నట్లుగా కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

ఇదిలావుండగా, హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆయన పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం, ఆయన కోరిన క్షమాపణను తిరస్కరించింది. రంగనాథ్ స్థానంలో మరో సమర్థుడైన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
Advertisement
AV Ranganath
Kalvakuntla Kavitha
Telangana High Court
HYDRA Commissioner
Revanth Reddy government

More Telugu News