ఇండిగో విమానంలో పొగలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo flight smoke detected emergency landing in Rajkot
  • దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో కలకలం
  • కార్గో విభాగంలో పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది
  • గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
దుబాయ్ నుంచి ముంబై వెళుతున్న ఇండిగో విమానంలో కలకలం రేగింది. విమానంలోని కార్గో విభాగంలో పొగలు రావడాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే అప్రమత్తమై, విమానాన్ని గుజరాత్‌లోని రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 194 మంది ప్రయాణికులు ఉండగా, వారందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం దుబాయ్ నుంచి ముంబైకి బయలుదేరిన ఇండిగో విమానం మార్గమధ్యంలో ఉండగా, కార్గో హోల్డ్‌లో పొగలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని రాజ్‌కోట్‌కు మళ్లించినట్లు రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ దిగంత బోరా తెలిపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఆయన ధ్రువీకరించారు.

ఈ ఘటన నేపథ్యంలో రాజ్‌కోట్ విమానాశ్రయంలో అధికారులు 'ఫుల్ ఎమర్జెన్సీ' ప్రకటించారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి అగ్నిమాపక దళం, భద్రతా బృందాలను సిద్ధంగా ఉంచారు. విమానం దారి మళ్లించడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురైనప్పటికీ, విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వారందరినీ సురక్షితంగా కిందికి దించారు.
Advertisement
IndiGo
IndiGo emergency landing
Rajkot International Airport
Dubai Mumbai flight smoke
IndiGo flight safety incident

More Telugu News