Advertisement

కాపు వర్గాలు ఎటువైపు మొగ్గుచూపితే అటు వైపే అధికారం: టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా కీలక వ్యాఖ్యలు

Bonda Umamaheshwara Rao says power follows the direction where Kapu communities lean
  • ముద్రగడ ఉద్యమం వల్లే 2019లో టీడీపీ ఓడిపోయింది
  • కాపుల ఓట్లతోనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది
  • విజయవాడలో ముద్రగడ పద్మనాభం విగ్రహం ఏర్పాటు చేస్తాం
  • ఒకే వేదికపై బొండా ఉమ, అంబటి రాంబాబు పక్కపక్కనే
రాష్ట్ర జనాభాలో కోటి మందికి పైగా ఉన్న కాపు, బలిజ, తూర్పు కాపు సామాజికవర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శనివారం గుంటూరులో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో సాగిన కాపు ఉద్యమం కారణంగానే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైందని ఆయన పేర్కొన్నారు. నాడు జరిగిన కొన్ని వ్యతిరేక ప్రచారాల వల్ల ముద్రగడ ప్రారంభించిన ఉద్యమం టీడీపీ ఓటమికి దారితీసిందని విశ్లేషించారు. రాష్ట్ర జనాభాలో 25 శాతం ఉన్న కాపులకు జనాభా దామాషా ప్రకారం నిధులు, పదవులు కేటాయించాలన్నది సమంజసమైన ఆకాంక్ష అని, వారిలో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. త్వరలోనే విజయవాడలో ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడ మాటకు కట్టుబడే వ్యక్తి అని కొనియాడారు. ఇచ్చిన మాట కోసం తన పేరునే మార్చుకున్న గొప్ప వ్యక్తి అని ఆయన గుర్తుచేశారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నేతలు బొండా ఉమ, అంబటి రాంబాబు ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకోవడం ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు, కిలారి రోశయ్య తదితరులు పాల్గొన్నారు.                                
Advertisement
Bonda Umamaheshwara Rao
Kapu Community
Mudragada Padmanabham
Andhra Pradesh Politics
Telugu Desam Party
Kapu JAC Guntur

More Telugu News