Advertisement

నీట్ నిరసనలు: జన్ శక్తి జనతా దళ్ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్ట్, 14 రోజుల జైలు

Tej Pratap Yadav JSJD chief sent to 14 days judicial remand in Bihar
  • నీట్ పేపర్ లీక్‌పై పాట్నాలో హింసాత్మక నిరసనలు
  • ఆందోళనలో పాల్గొన్న తేజ్ ప్రతాప్ యాదవ్ అరెస్ట్
  • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించిన కోర్టు
  • సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న న్యాయవాది
జన్‌ శక్తి జనతా దళ్ (JSJD) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు పాట్నా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అధికారులు బేవూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.

నీట్ పేపర్ లీకేజీ ఉదంతం, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, పలు సామాజిక సంస్థలు శనివారం బీహార్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పాట్నాలో వేలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పగలగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పాట్నాలోని రామ్ గులాం చౌక్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, తమ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం, సాయంత్రం సమయంలో దక్ బంగ్లా చౌరహా వద్ద పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తేజ్‌ ప్రతాప్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో, సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు.                                
Advertisement
Tej Pratap Yadav
Jan Shakti Janata Dal
NEET Protests Bihar
Patna Police Arrest
NEET Paper Leak Controversy
Beur Central Jail

More Telugu News