Advertisement

విద్యార్థుల ఐక్యతను చూసి గర్విస్తున్నాను: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi demands PM Modi apology over student protests
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన లోక్‌సభలో ప్రతిపక్ష నేత
  • ప్రతి విద్యార్థికి, యువకుడికి అభినందనలు తెలిపిన రాహుల్‌
  • ప్రధాన డిమాండ్లు ఇంకా నెరవేరలేదన్న కాంగ్రెస్ అగ్రనేత
  • మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • లాఠీఛార్జీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టు
  • ఇతర వర్గాలూ ఆత్మగౌరవం కోసం నిలబడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో విద్యా వ్యవస్థను తిరిగి సరైన మార్గంలో పెట్టేందుకు ఈ పరిణామం ఒక పెద్ద అడుగు అని అభివర్ణించారు. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు పోరాడిన ప్రతి విద్యార్థికి, యువకుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. విద్యార్థుల ఐక్యతను చూసి గర్విస్తున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు.

మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకొన్నప్పటికీ, తమ ప్రధాన డిమాండ్లు ఇంకా నెరవేరలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులు, దేశ భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన హింసకు, లాఠీఛార్జీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే రెండు ముఖ్యమైన డిమాండ్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. బాధ్యులైన ప్రతీ ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని ఉద్ఘాటించారు.

ఈ ప్రభుత్వం చేతిలో అణచివేతకు గురైన రైతులు, కూలీలు, పేదలు, ఇతర వర్గాల ప్రజలందరూ తమ ఆత్మగౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా నిలబడాల్సిన సమయం వచ్చిందని రాహుల్ పిలుపునిచ్చారు. అణచివేతకు భయపడకుండా ధైర్యంగా నిలబడటంలోనే అసలైన నిరసన బలం ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ, ‘‘ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.
Advertisement
Rahul Gandhi
Dharmendra Pradhan resignation
Student unity India
Narendra Modi apology
Education system reforms
Opposition leader Lok Sabha

More Telugu News